ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

పరిగి: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల్లో కేసీఆర్‌ విలువలను తగ్గించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అన్నారు. నేడు రాష్ట్రంలో 37లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయంటే అది కేవలం కాళేశ్వరంతోనే సాధ్యమైందన్నారు. ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌, హరీశ్‌రావులపై బురదచల్లి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం గంపెడు మట్టి తీశారా అని ప్రశ్నించారు. దాదాపు 90శాతం పూర్తయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారని, జిల్లాను విస్మరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, పార్టీ సీనియర్‌ నాయకులు శిశనోళ్ల భాస్కర్‌, సురేందర్‌, హన్మంత్‌రెడ్డి, రాజు, గుర్మిట్కల్‌ మల్లేష్‌, ఎదిరే కృష్ణ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement