బిల్లు పట్టు! | - | Sakshi
Sakshi News home page

బిల్లు పట్టు!

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

జీపీలు మొదలుకొని, ఎమ్మెల్యేల నిధులు వరకు.. ఒక్కో దానికి ఒక్కో రేటు 2 నుంచి 10 శాతం వరకు వసూళ్లు లేదంటే బిల్లులు ఆపేస్తున్న వైనం

ఉన్నత స్థాయిలోనూ..

పైసా కొట్టు..
ట్రెజరీల్లో పర్సెంటేజీల పర్వం

వికారాబాద్‌: ట్రెజరీల్లో (ఎస్టీఓ, డీటీఓ కార్యాలయాలు) పర్సెంటేజీల పర్వం కొనసాగుతోంది. బిల్లు మంజూరు కావాంటే చేయి తడపాల్సిందే. జిల్లాలోని నాలుగు ఎస్టీఓలతో పాటు డీటీఓలో సైతం ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలు, ఎమ్మెల్యేల నిధులకు సంబంధించిన బిల్లులు మొదలుకొని ఉద్యోగుల బిల్లుల వరకు అమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. పనులను బట్టి 2 నుంచి 8 శాతం వరకు పర్సెంటీజీలు దండుకుంటున్నట్లు సమాచారం. డబ్బు ఇవ్వకుంటే బిల్లులు మంజూరు కావడం లేదు. ఒక్కోసారి ఏడాది నుంచి రెండేళ్ల పాటు వేచిచూడక తప్పడం లేదని సర్పంచులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఆరోపించారు. బిల్లు ఆలస్యం అయితే బయట తెచ్చిన డబ్బులకు వడ్డీ భారీగా కట్టాల్సి వస్తోందని.. ఈ కారణంగానే ట్రెజరీ అధికారులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఎవరికై న ఫిర్యాదు చేస్తే మీ ఇష్టం అని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో డీటీఓలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ విషయం కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. డీటీ ఆఫీసులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఓ అధికారి అందరినీ మ్యానేజ్‌ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

వేతనాలు మినహా..

ఉద్యోగుల వేతనాలు మినహా మిగతా అన్ని రకాల బిల్లులకు పర్సెంటేజీలు ఇవ్వాల్సిందే. ఆర్థిక సంఘం నిధులు నేరుగా జీపీ ఖాతాల్లో జమ అవుతుండగా సర్పంచ్‌లు ఈ సమస్య నుంచి బయటపడ్డారనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీటికి కూడా తొందరగా బిల్లులు చేసేందుకు ముడుపులు ఇవ్వాల్సిందేనని సర్పంచులు పేర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్‌డీఎఫ్‌ తదితర వాటికి డబ్బు ఇచ్చుకోవాల్సి వస్తోందని సర్పంచులు వాపోయారు. ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు, డీఏ, పీఆర్సీ ఏరియర్స్‌, జీపీఎఫ్‌, ఫెస్టివల్‌ అడ్వాన్స్‌లు, రిటైర్డ్‌మెంట్‌ సమయంలో వచ్చే డబ్బులు, ఈఎల్స్‌తో పాటు అత్యవసర బిల్లులు, పాల బిల్లులకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. కింది స్థాయి అధికారులను మొదలుకుని జిల్లా స్థాయి అధికారుల వరకు ఈ చదివింపులు తప్పడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో గతంలో జెడ్పీ అధికారులు, ట్రెజరీ అధికారుల మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఇటీవల కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ఓ అధికారి జీపీఎఫ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఎనిమిది శాతం ఇస్తేనే బిల్లులు త్వరగా వస్తాయని తెలపడంతో ఆయన ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క ఉద్యోగులతో చెప్పుకొని వాపోయాడు.

అభివృద్ధి పనులకు సంబంధించి ఉన్నత స్థాయిలోనూ ఆరు నుంచి పది శాతం డబ్బులు ఇస్తేనే వారం పది రోజుల్లో బిల్లులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంటు వారితో వికారాబాద్‌ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి ఈ లావాదేవీలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అడిగిన డబ్బు ముందే ఇస్తే అత్యవసర బిల్లుల పేరుతో వారం పది రోజుల్లో బిల్లులు అందేలా చూస్తున్నా రని.. లేదంటే నెలలు, సంవత్సరాలు ఆగాల్సి వస్తోందని ఓ కాంట్రాక్టర్‌ వాపోయాడు. మీడియాలో కథనాలు వచ్చిన సమయంలో మరింత ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. వైద్య శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి జీపీఎఫ్‌ డబ్బుల కోసం బిల్లులు పెట్టుకున్నాడు. అతనికి టోకెన్‌ వచ్చి కూడా తొమ్మిది నెలలు గడుస్తోంది. నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇటీవల తనకు తెలిసిన స్నేహితుని సూచన మేరకు డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగిని సంప్రదించగా టెన్‌ పర్సెంటేజీ ఇస్తే బిల్లులు వస్తాయని చెప్పటంతో చేసేదిలేక వెనుదిరిగాడు. అతని తోటి ఉద్యోగికి డబ్బులు అత్యవసరం ఉండటంతో అదే పది శాతం చెల్లించటంతో పని పూర్తయ్యింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఎవరిని కదిపినా ఆది తంతూ కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement