పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచండి

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

● నాణ్యత ప్రమాణాలు పాటించాలి ● కలెక్టర్‌ దీపక్‌ తివారి ● హకీంపేట్‌లో ఎడ్యుకేషన్‌ హబ్‌పనుల పరిశీలన

దుద్యాల్‌: మండలంలోని హకీంపేట్‌ శివారులో చేపట్టిన ఎడ్యుకేషన్‌ హబ్‌ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. బుధవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. మెడికల్‌, నర్సింగ్‌, మహిళా డిగ్రీ, బాలిక, బాలుర హాస్టళ్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, ఇంజనీరింగ్‌ కళాశాలల పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిషన్‌, జీపీవో గోపాల్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏఈ విజయ భాస్కర్‌ రెడ్డి, డీఈఈ రాజయ్య, ఏఈ విజయ భాస్కర్‌ రెడ్డి, సూపర్‌వైజర్‌ వెంకటేశ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ భవనం ప్రారంభం

విద్యార్థి జీవితంలో పూర్వ ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం మండలంలోని ఎక్కచెరువు తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన మోడల్‌ అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పిల్లలను చదువుకు అలవాటు చేయాలని సూచించారు. పౌష్టికాహారంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును పరిశీలించారు. ఎక్క చెరువు తండా మీదుగా రోడ్డు మంజూరై రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. హస్నాబాద్‌ నుంచి చిలుముల్‌ మైల్వార్‌ వరకు మంజూరైన రోడ్డు పల్గురాళ్ల తండా వరకు మాత్రమే వేశారని.. తర్వాత పనులు ఆపేశారని తెలిపారు. వెంటనే పనులు పూర్తియ్యేలా చూడాలని కోరారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలో పనులు జరిగేలా చూస్తామన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు సీతారం నాయక్‌, మంగలి రాములు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నిర్మల, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రవి నాయక్‌, వివిధ గ్రామాల సర్పంచులు హన్మానాయక్‌, మాణిక్య నాయక్‌, లాలప్ప, గోపాల్‌, మోతీలాల్‌, నాయకులు నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలి

కొడంగల్‌: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పనులు ఎంత వరకు జరిగాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అలసత్వం తగదని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయం చుట్టూ ఇళ్లు కోల్పోతున్న వారికి ఇచ్చే స్థలాల లే అవుట్‌ను సందర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు తొలగించారని ఇంకా ఎన్ని తొలగించాల్సి ఉందని అధికారులను అడిగారు. ఆలయ నిర్మాణ పనులను వేగిరం చేయాలని ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌గుప్తా, కమిషనర్‌ బలరాం నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement