కిక్కిరిసిన ప్రైవేటు వాహనాలు ప్రజా రవాణా లేక ప్రయాణికుల ఇక్కట్లు డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు
వికారాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా సదుపాయం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా ఉద్యోగులు, కార్మికులు డిపో గేట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. వికారాబాద్, పరిగి, తాండూరు డిపోల్లో ఆర్టీసీ, హయర్ బస్సులు కలిపి 247 వరకు ఉన్నాయి. 908 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొన్నారు. వికారాబాద్ డిపోకు చెందిన ఐదు ప్రైవేటు బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో గమ్యాలకు చేరుకోవాల్సి వస్తోంది. వాహనాలు జనంతో కిక్కిరిసి పోయాయి. రేట్లు పెంచినట్లు ప్రయాణికులు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట


