బిడ్డా బాగా చదువుకో.. | - | Sakshi
Sakshi News home page

బిడ్డా బాగా చదువుకో..

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

భర్త వేధింపులు తాళలేక గడ్డి మందు తాగిన వివాహిత వారం రోజులుగా మృత్యువుతో పోరాటం కుమారుడి పుట్టిన రోజే చనిపోయిన తల్లి

యాలాల: పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాలాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెన్నారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌ రెడ్డి తెలిపిపన వివరాల ప్రకారం.. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీనివాస్‌, శోభమ్మ దంపతుల కూతురు దేవి(33). ఈమెను చెన్నారం గ్రామానికి చెందిన జటంగి హన్మంతుకు ఇచ్చి 2010లో వివాహం చేశారు. కొన్నేళ్ల పాటు వీరి జీవితం అన్యోన్యంగా సాగింది. తాగుడుకు బానిసైనా హన్మంతు భార్యను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. గతంలో చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 13న ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్య దేవిని మరో సారి డబ్బుల కోసం వేధించాడు. మీ పుట్టింటికి వెళ్లి డబ్బులు తెస్తావా? చస్తావా..? అని బెదిరించాడు. వేధింపులు తాళలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. వెంటనే తండ్రి ఎర్ర శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. హుటాహుటీన ఆయన గ్రామానికి చేరుకొని కూతురు దేవిని ఆటోలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులపాటు చిక్సిత్స అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎర్ర శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు అల్లుడు జటంగి హన్మంతుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొడుకు జన్మదినం రోజునే..

జటంగి దేవి, హన్మంతు దంపతులకు అభిలాష్‌(13), పున్నమి(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు కావడంతో కొడుకు అభిలాష్‌ ఆస్పత్రికి వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. బిడ్డా బాగా చదువుకో అని తల్లి చెప్పింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. సాయంత్రానికి ప్రాణాలు వదిలింది. దీంతో బాలుడు గుండె పగిలేలా ఏడ్చాడు. బుధవారం చెన్నారంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిలాష్‌ తల్లికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇది చూసిన బంధువులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

కొడుకుతో తల్లి చివరి మాటలు

Advertisement
 
Advertisement
Advertisement