రోడ్డెక్కని బస్సులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని బస్సులు

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు

రవాణా సదుపాయం లేక

ప్రయాణికుల అవస్థలు

పోలీసు ఎస్కార్ట్‌తో నడిచిన బస్సు

తాండూరు టౌన్‌: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తాండూరు పట్టణంలోని బస్సు డిపోలో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు విధులకు గైర్హాజరై సమ్మెకు దిగారు. డిపోలో నుంచి బస్సులను బయటకు రానివ్వలేదు. బస్సు డిపో ఎదుట నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ, తెలంగాణ జనసమితి, సీఐటీయూ తదితర పార్టీలు, సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా టీజేఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సోమశేఖర్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్‌ కుమార్‌తో పాటు పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రయాణికుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌తో ఎట్టకేలకు తాండూరు డిపో నుంచి బస్సును రోడ్డెక్కించారు. తాండూరు నుంచి మహబూబ్‌నగర్‌ మార్గంలో బస్సును నడిపారు.బస్సులు రోడ్డెక్కక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

తాండూరు బస్‌ డిపోలో 68 ఆర్టీసీ బస్సులు, 32 అద్దె బస్సులు ఉన్నాయని, వీటి వల్ల నిత్యం రూ.16లక్షల మేర ఆదాయం వస్తోందని డిపో మేనేజర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 351 మంది ఉద్యోగులు తాండూరు డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సహాయంతో బస్సులను నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, పలువురు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement