నకిలీ విపత్తు! | - | Sakshi
Sakshi News home page

నకిలీ విపత్తు!

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కొడంగల్‌: కర్ణాటక కేంద్రంగా నాసిరకం విత్తనాలు సరఫరా అవుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గానికి పడమర, దక్షిణ భాగంలో కర్ణాటక రాష్ట్రం విస్తరించి ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది దళారులు నాసిరకం విత్తనాలను హైదరాబాద్‌ – బీజాపూర్‌, మహబూబ్‌నగర్‌ – చించోలి జాతీయ రహదారుల మీదుగా కొడంగల్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో నకిలీ.. నాసిరకం విత్తనాల విక్రయాలకు కొందరు వ్యాపారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు గ్రామాల్లో యువకులను ఏజెంట్లుగా నియమించుకొని రైతులకు ఎర వేస్తున్నారు. జూన్‌ మాసంలో ఖరీఫ్‌ సీజం ప్రారంభం అవుతుంది. దీంతో ఈ దందాకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని వ్యాపారులు నాసిరకం గింజలను కొనుగోలు చేసి విత్తనాల పేరుతో విక్రయిస్తున్నారు. ఖరీఫ్‌కు ముందే పలు గ్రామాల్లో దందాకు ప్రయత్నిస్తున్నారు. రైతులను మోసం చేసి వేల రూపాయలు దండుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌ కంపెనీల కవర్లలో నింపి విక్రయిస్తున్నారు. అభం శుభం తెలియని రైతులు వాటిని కొనుగోలు చేసి పంట దిగుబడి రాక నష్టపోతున్నారు.

గుర్మిట్కల్‌లో నకిలీ మూలాలు

కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్‌లో ఒక ఎరువుల వ్యాపారి నకిలీ విత్తనాల దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను అక్కడి కుష్టిగిరి జిల్లాలోని జిన్నింగ్‌ మిల్లు నుంచి తక్కువ ధరకు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి వాటికి రంగులు కలిపి బ్రాండెడ్‌ కంపెనీల కవర్లలో ప్యాకింగ్‌ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఒక ప్యాకింగ్‌ కంపెనీలో బ్రాండెడ్‌ కంపెనీల కవర్లను కొనుగోలు చేసి ఆ కవర్లలో నాసిరకం విత్తనాలు పోసి ప్యాకెట్లుగా తయారు చేయించి ఏజెంట్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నాడు. వికారాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల విక్రయించడానికి ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. వారి ద్వారా వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పలుమార్లు పట్టుబడినా..

గతంలో కొడంగల్‌ మండలం అన్నారం గ్రామంలో ఒకరి ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో దొరికిన సామగ్రిని చూసి అధికారులు నివ్వెరపోయారు. 320 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో ఉన్న 60 ప్యాకెట్లు, వివిధ కంపెనీల పేరుతో తయారు చేయించిన 290 కవర్లు, విత్తనాలు కొలిచే డబ్బా దొరికింది. అదే రోజు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. నిఘా పెంచడంతో సూత్రధారులు, పాత్రధారులు పట్టుబడ్డారు. కొంత కాలానికి వారు రిమాండ్‌ నుంచి బయటకు వచ్చి తిరిగి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ వ్యవహారంపై వికారాబాద్‌ జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం జూన్‌లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

కర్ణాటక కేంద్రంగా నాసిరకం విత్తనాల దందా

బీబాపూర్‌, చొంచోలి హైవేల మీదుగా జిల్లాలోకి రవాణా

బ్రాండెడ్‌ కంపెనీల కవర్లలో నింపి విక్రయం

ఏటా పట్టుబడుతున్నా వెనక్కి తగ్గని అక్రమార్కులు

ఖరీఫ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఏజెంట్ల నియామకం

రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

కఠిన చర్యలు తీసుకుంటాం

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తాం. నకిలీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సమాజానికి హాని కలిగించే కల్తీ, నకిలీ సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్‌రెడ్డి, సీఐ, కొడంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement