ఎల్లమ్మ ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

ఎల్లమ్మ ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక గోమాతను రక్షించుకోవాలి జేఈఈ మెయిన్స్‌లో కేరెళ్లి విద్యార్థి ప్రతిభ

తాండూరు రూరల్‌: మండలంలోని కొత్లాపూర్‌ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా మంగళవారం తైబజార్‌కు వేలం నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ పట్లోళ్ల ప్రవీణ్‌ రెడ్డి, ఈఓ శేఖర్‌ గౌడ్‌ అధ్యక్షతన ఈ ప్రక్రియ చేపట్టారు. జాతరలో కొబ్బరి కాయాల విక్రయానికి రూ.3.60 లక్షలు.. పార్కింగ్‌కు రూ.2 లక్షలు, తైబజార్‌కు రూ.1.09 లక్షలు, పప్పు దినుసులకు రూ.47 వేలకు పాట దక్కించుకున్నారు. వేలం ద్వారా ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరక్టర్లు సుజాత, నర్సింలు, రాజు, జీ రాజు, లక్ష్మీ, నాయకులు వెంకట్రాంరెడ్డి, సాయిలు, బసిరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, శంషోద్దీన్‌, బీ రాజు, వెంకట్‌రెడ్డి, శాంతప్ప, గోపాల్‌, లాలయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. నలుగురు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. జనరల్‌ స్థానం నుంచి పట్టణ మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబు, జనరల్‌ మహిళ నుంచి ఐనన్‌పల్లికి చెందిన సావిత్రమ్మ, మైనార్టీ నుంచి మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు మునీర్‌ ఖాద్రీ, మైనార్టీ మహిళ నుంచి కలాల్‌వాడకు చెందిన షరీఫాబేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ బలం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. వార్డుల్లోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కమిషనర్‌ బలరాం నాయక్‌, వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, కౌన్సిలర్లు కృష్ణంరాజు, రాజశేఖర్‌, సుష్మ, అనిత, వాణిశ్రీ యాదవ్‌, హమీద్‌, బాలమ్మ, లక్ష్మమ్మ, సన ఆఫ్రీనా తదితరులు పాల్గొన్నారు.

మోమిన్‌పేట: హిందూ సంస్కృతిలో భాగమైన గోమాతను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని శ్రీ శంకర్‌ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్‌ ట్రస్టు సభ్యుడు శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్వామి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ కుటుంబాల్లో గోవు మమేకమైందన్నారు. గోవును తల్లిగా భావిస్తారని పేర్కొన్నారు. నేడు గో రక్షణ ప్రతి హిందువు చేతిలో ఉందన్నారు. గోశాలలను నిర్వహించాలని సూచించారు.

ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన మంగమోళ్ల శివరామ్‌రెడ్డి సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంక్‌ సాధించి ఇంజనీరింగ్‌ సీటు దక్కించుకున్నారు. తుది ఫలితాల్లో ఆయనకు 99.46 స్కోరు సాధించారు. శ్రీనివాస్‌రెడ్డి, రజిత దంపతుల కుమారుడు శివరామ్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కీసర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివాడు, నగరంలోని నార్సింగిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. గ్రామస్థులు, విద్యార్థిని అతని తల్లిదండ్రులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement