● ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
● టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం పరిగి ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే సమ్మెకు టీజేఎంయూ పూర్తి మద్దతు ప్రకటిస్తోందన్నారు. సమస్యలపై పోరాటం చేసేందుకు యూనియన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. 2021 – 25 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని.. చాలి చాలని వేతనాలతో ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


