నేటి నుంచి పోలీసు ఫైరింగ్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పోలీసు ఫైరింగ్‌ శిక్షణ

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపాలిటీ కొత్రెపల్లి వార్డు శివారులోని ఓపెన్‌ జైలు ప్రాంతంలో ఈ నెల 22 నుంచి నెల రోజుల పాటు పోలీసు ఫైరింగ్‌ శిక్షణ నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5నుంచి రాత్రి 9గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. భద్రతా దృష్ట్యా పట్టణ, సమీప గ్రామ ప్రజలు, పశువుల కాపరులు ఎవరు ఆ పరిసరాల్లోకి వెళ్లకూడదని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

నేరాల అదుపునకు తనిఖీలు

డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య

తాండూరు టౌన్‌: నేరాలను అదుపు చేసేందుకు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశానుసారం తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించేందుకు పాపులాన్‌ డివైస్‌ను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనపడితే ప్రజలు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేశ్వర్‌, ఎస్‌ఐలు అంబర్య, సాజిద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సమావేశం

అనంతగిరి: జిల్లా పోలీసు కోఆపరేటివ్‌ సొసైటీ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎస్పీ స్నేహ మెహ్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో సొసైటీ సాధించిన పురోగతి, సిబ్బందికి అందించిన రుణ సదుపాయాలను, ఇతర సంక్షేమ ఫలాలను కార్యనిర్వాహక సభ్యులు ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఆమె సొసైటీ అభ్యున్నతికి చేపడుతున్న పనులను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్‌, ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఆర్‌ఐ నాగరాజు, జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, పలువురు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సొసైటీ డైరక్టర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వివాహిత మృతి

పరిగి: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పరిగి ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన రాధిక అలియాస్‌ జయలలిత(24), దస్తయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. కుటుంబ గొడవల కారణంగా ఈనెల 15న రాధిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాధిక తల్లి మొగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement