ధారూరు: ఇసుక అక్రమ డంపులను స్వాధీనం చేసుకోవాలని మండలంలోని నాగారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నేత కృష్ణారెడ్డి స్థానిక ఎస్‌ఐకి శనివారం ఫిర్యాదు చేశారు. పరాక్‌రావు కత్వ నుంచి ఇసుకను ఓ వ్యక్తి జేసీబీతో తోడించి 50 టిప్పులు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి ఊరబావి దగ్గర డంప్ చేశారని ఆరోపించారు. ఇందుకు గ్రామ సర్పంచ్, ఆమె భర్త సహకరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఇసుక డంప్‌ను స్వాధీనం చేసుకొని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ సాజిదాబేగం దృష్టికి తీసుకెళ్లగా.. ఎస్‌ఐకి సూచించి ఇసుక డంప్ తరలిపోకుండా చూస్తానని పేర్కొన్నారు. స్థానిక వీఆర్‌ఏను కాపలా పెడతామని చెప్పారు.
లైన్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలి
కొర్విచెడ్ సర్పంచ్ నవీన్‌రెడ్డి
బషీరాబాద్: విద్యుత్ సరఫరా విషయంలో ఫోన్ చేస్తే కొర్విచెడ్ లైన్‌మెన్ రాజు స్పందించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా కర్విచెడ్ గని, కర్విచెడ్ గ్రామాలకు కరెంట్ కట్ అవుతుందని, మండలంలోని మిగతా గ్రామాలకు సరఫరా ఉంటుందని చెబుతున్నారు. లైన్‌మెన్ నిర్లక్ష్యంతో రాత్రులు కరెంట్ లేక జాగారం చేశామని కొర్విచెడ్ సర్పంచ్ నవీన్‌రెడ్డి ఆరోపించారు. కరెంట్ లేక పోవడంతో ఓ మహిళకు తేలు కాటు, మరొకరికి ఎలుకలు కరిచాయని తెలిపారు. ఎమర్జెన్సీ టైంలో ఫోన్‌లు చేస్తే స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నాడని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని శనివారం విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఓయూలో బడ్జెట్ ప్రతుల చించివేత
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర బడ్జెట్‌లో విద్య రంగానికి అతి తక్కువ నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ ఓయూలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు బడ్జెట్ ప్రతులను చించివేశారు. శనివారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జంగయ్య, మోటపోతుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేవలం రూ.26,674 కోట్ల (8.22 శాతం) నిధులను మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. విద్యా శాఖను తన చేతుల్లో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం అత్యంత బాధకరమన్నారు. కార్యక్రమంలో కాటం శివ, నాగారం ప్రశాంత్, నాగరాజు, శ్రీనునాయక్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, పవన్, కొండ గణేష్, రాకేష్, వినోద్, కార్తీక్ పాల్గొన్నారు.
గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగురవేద్దాం
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని 9 జిల్లాల అధ్యక్షులు, కీలక నాయకులతో సికింద్రాబాద్‌లో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ క్యాడర్‌తో నాయకులంతా కలసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. జీహచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయానికి నాయకులంతా పనిచేయాలని సూచించారు.


