ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులపై దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులపై దాడి

Mar 22 2026 1:26 AM | Updated on Mar 22 2026 1:26 AM

అన్న కూతురుతో పాటు ఆమె భర్తను గాయపర్చిన బాబాయి

నవాబుపేట పీఎస్‌లో కేసు నమోదు

నవాబుపేట: తన అన్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి దంపతులిద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గంగ్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శివకుమార్‌.. ఇదే ఊరికి చెందిన ఊర కురువ బుచ్చయ్య కూతురు స్వాతిని ప్రేమించి, గతేడాది జూన్‌ 24న పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో గ్రామంలోనే ఉంటున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల క్రితం స్వాతి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇది ఇష్టం లేని ఆమె బాబాయి కురువ పరమేశ్‌ బుధవారం ఉదయం స్వాతిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్‌ వాళ్ల ఇంటికి వెళ్లి నా భార్యను ఎందుకు కొట్టావని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పరమేశ్‌ కట్టెలు, రాళ్లతో దాడిచేసి శివకుమార్‌ను సైతం గాయపర్చాడు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. గురువారం నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పుండ్లిక్‌ తెలిపారు. ఇదిలా ఉండగా శివకుమార్‌కు తీవ్రగాయాలైనప్పటికీ ఆస్పత్రిలో పనిచేసే ఓ వైద్యుడు సాధారణ దెబ్బలే తగిలాయంటూ తప్పుడు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలవగా ఆయన ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement