ఇబ్రహీంపట్నం: మొబైల్ ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో చెట్టు కింద కూర్చున్న మహిళలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన గుగులోతు మహేశ్ వెటర్నరీ మెడిసిన్ సేల్స్‌మెన్. శేరిగూడలో ఓ వెటర్నరీ దుకాణంలో ఆర్డర్ కోసం వచ్చిన ఆయన గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎదుట నుంచి ప్రయాణిస్తున్నాడు. సెల్‌ఫోన్ చూస్తూ కారు నడపడంతో అదుపుతప్పి పక్కనే చెట్టుకింద కూర్చున్న మహిళలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అలివేలు, పోచమ్మ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. పెంటమ్మ, లక్ష్మమ్మ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నగరం సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా డ్రైవర్ మహేశ్ కళ్లు తిరగడంతో వాహనం అదుపుతప్పిందని పోలీసులకు వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
● చెట్టు కింద కూర్చున్న మహిళలపై దూసుకెళ్లిన కారు
● ఇద్దరికి తీవ్రంగా.. మరో ఇద్దరికి స్వల్పగాయాలు


