పెండింగ్‌ డీఏ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ డీఏ విడుదల చేయాలి

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

పెండింగ్‌ డీఏ విడుదల చేయాలి మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ పాంబండ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఉద్యమాలను వృథా కానివ్వం

తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య

తాండూరు టౌన్‌: ట్రెజరీ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న డీఏ వాయిదాల బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన తాండూరు తపస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నివేదిక అశాసీ్త్రయమైందని, తప్పులు తడకగా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. అనంతరం తపస్‌ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి హన్మంతరావు మాట్లాడుతూ.. తపస్‌ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్సీ, రాష్ట్ర బాధ్యులతో కలిసి కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సంగమేష్‌, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌, రాష్ట్ర కార్యదర్శి అంజిరెడ్డి, సభ్యులు ఆనందం, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య

అనంతగిరి: వికారాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఖర్జురా ఇచ్చి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎండీ హఫీజ్‌, కౌన్సిలర్‌ చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్‌, నాయకులు రంగరాజు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: పాంబండ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పాంబండ ఉత్సవ కమిటీ చైర్మన్‌ కోట్ల మైపాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి

మొయినాబాద్‌: రాష్ట్ర సాధనకోసం చేసిన ఉద్యమాలను వృథా కానివ్వమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్‌ యాలల మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 10న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహించనున్న ‘చలో గన్‌పార్క్‌ మిలియన్‌ మార్చ్‌’ కార్యక్రమానికి ఉద్యమకారులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఉద్యమ మహిళలకు సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకుడు కేబుల్‌ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రమేష్‌, మండల అధ్యక్షుడు మహిపాల్‌, ఉద్యమకారులు సుభాష్‌ చంద్రబోస్‌, ముకుందరెడ్డి, బన్సీలాల్‌, మధు, వెంకటరత్నం, అరవింద్‌, నవీన్‌, రజినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement