అనంతగిరి: వికారాబాద్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలెక్టర్ దీపక్ తివారి ఎస్‌ఏపీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు.
సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు
ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సత్తార్
మోమిన్‌పేట: రైతులు తప్పనిసరిగా బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి ఎంఏ సత్తార్ అన్నారు. సోమవారం మండల పరిఽఽధిలోని వెల్‌చాల్, దుర్గంచెర్వు రైతులకు బిందు, స్ప్రింక్లర్ల వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ..ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలను అందజేస్తోందన్నారు. స్ప్రింక్లర్లపై గరిష్టంగా 75 శాతం రాయితీ ఉంటుందన్నారు. బిందు సేద్య పరికరాలతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేపట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి అక్షితరెడ్డి, రైతులు ఉన్నారు.
ఠాణాకు ‘పది’ ప్రశ్న పత్రాలు
14 నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు
బషీరాబాద్: ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షల ప్రశ్నాలు సెట్–1 సోమవారం బషీరాబాద్ ఠాణాకు చేరాయి. 9వ తేదీన సెట్–2 రానున్నాయి. ఈ పశ్నాపత్రాలను యాలాల ఎంఈఓ, రూట్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నడుమ వాహనంలో తీసుకువచ్చారు. వీటిని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ ఎండీ షరీఫ్, అనీల సమక్షంలో ఠాణాలోని సెల్‌లో భద్రపరిచారు. మండలంలో 13 ఉన్నత పాఠశాలకు గాను జెడ్పీహెచ్‌ఎస్(బాలుర), మోడల్ స్కూల్‌లో రెండుపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 495 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కార్యక్రమంలో జమిందార్ లోక్యానాయక్, డిపార్ట్‌మెంట్ అధికారులు నర్సింలు, టీచర్లు నాగరాజు, రవికుమార్ సుగంధి పాల్గొన్నారు.
తాండూరు ఏఎంసీ
చైర్మన్‌గా నర్సింలు
తాండూరు:తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలును నియమిస్తూ మార్కెటింగ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చైర్మన్‌గా పట్లోళ్ల బాల్‌రాజ్ సతీమణి నీరజ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ బాల్‌రాజ్ అదే రోజు తన పదవికి రాజీనామా చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాజీ కౌన్సిలర్ పటోళ్ల నర్సింలుకు అవకాశం కల్పించాలని మార్కెటింగ్ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.


