మాస్టర్ ప్లాన్.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మాస్టర్‌ప్లాన్ లోపభూయిష్టంగా ఉందని, అందులో రైతులకు తీరని అన్యాయం జరిగిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రైతులు, పేదలు, అమాయకులు, తమ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్ వల్ల 50 వేల మందికిపైగా రైతుల భూములు 11 ఏళ్లుగా కన్జర్వేషన్ జోన్‌లో ఉన్నాయని, వాటిని బహుళ వినియోగ జోన్‌లోకి మార్చకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని విస్మయం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్–2013 లోని లోపాలపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సామాజిక కార్యకర్త కరుణా గోపాల్, ఆదర్శరైతు వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. బౌరంపేట్ మాజీ సర్పంచ్ డాక్టర్ ఎస్.మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రభుత్వం భూములను విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం ప్రజాహితం కాదని దత్తాత్రేయ అన్నారు. రైతులు, సాధారణ ప్రజలకు భూమితోనే ఆత్మగౌరవం, సమాజంలో హోదా లభిస్తాయని అన్నారు. మాస్టర్‌ప్లాన్ వల్ల రైతులు ఏళ్ల తరబడి తమ భూములను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొనడం దారుణమన్నారు. కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న రైతుల భూములను వెంటనే బహుళ వినియోగంలోకి మార్చాలని కోరారు. మాస్టర్‌ప్లాన్ లోపాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జోన్ మార్పిడి కోసం రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రంలో భూసేకరణ చేస్తే రైతులు పండుగ చేసుకుంటారని, అక్కడ బయటి వాళ్లకు అమ్ముకుంటే ఎకరానికి రూ.70 లక్షల వరకు లభిస్తుందని, ప్రభుత్వం భూసేకరిస్తే మార్కెట్ రేట్ ప్రకారం రూ.కోటి చొప్పున అందజేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ ఔటర్‌రింగ్ రోడ్డుకు భూమి సేకరించడంతోనే నగరంలో భూసమస్య మొదలైందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు.
హెచ్‌ఎండీఏ తీరు లోపభూయిష్టంగా ఉందన్న వక్తలు
కన్జర్వేషన్ జోన్‌లోని రైతుల భూములకు తీరని అన్యాయం
రౌండ్‌టేబుల్ సమావేశంలో దత్తాత్రేయసహా పలువురి ధ్వజం


