పరిషత్ ఎన్నికలపై పార్టీల నజర్
కొడంగల్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకున్న పార్టీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించాయి. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించాయి. రిజర్వేషన్ ఏదైనా.. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారి వివరాలను ఇప్పటికే సేకరించి పెట్టుకుంటున్నాయి. అధికారికంగా రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థిని వెతకటం కన్నా.. ముందస్తుగా ఒక అంచనాకు రావాలనే ఆలోచనతో ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించాలని, ఆయా పార్టీల నేతలు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల నుంచి పోటీ పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో అన్ని ప్రాదేశిక స్థానాల్లో విజయం సాధించాలని హస్తం పార్టీ ఆరాట పడుతోంది. బీఆర్‌ఎస్ సైతం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మహేష్ రెడ్డి, రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీజేపీ పలు మండలాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ప్రణాళికాబద్ధంగా..
ఇటీవల తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందిన స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ మేరకు కొంత ముందస్తుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని, ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపైనా అంతర్గతంగా కసరత్తు చేస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది.. గెలిచే సత్తా ఎవరికి ఉంది.సామాజిక, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి.. తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
రేపు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
ఈనెల 22న సోమవారం ఉదయం ఆయా మండలాల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వార్డు సభ్యులతో ఆయా గ్రామాల్లోనే ప్రమాణ స్వీకారం చేయించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో కొత్తగా సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయనున్నారు.
వివరాలు
ఎంపీటీసీ స్థానాలు 227
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీపీ 20


