ప్రజలకు అవగాహన కల్పించండి
అనంతగిరి: ప్రజల జీవితాలను కాపాడాల్సిన బా ధ్యత అధికారులదేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం ఆయన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై గుంతలను పూడ్చివేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారుల అనుసంధాన రోడ్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మలుపులు ఉన్న రోడ్లను గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల జంక్షన్లలో సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి భాద్యత అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేపట్టి వైద్య సేవలు అందించాలని డిపో మేనేజర్‌కు సూచించారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓకు చెప్పా రు. మోతాదుకు మించి రవాణా చేపడుతున్న వా హనాలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలపై దృష్టి సారించాలని, రవాణ, మైనింగ్ అధికారులు ఉమ్మడి తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, రవాణా అధికారి వెంకట్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ జాఫర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


