విద్యాసంస్థలను తరలించొద్దు
● కొడంగల్‌లోనే కొనసాగించాలి
● కేడీపీ జేఏసీ సభ్యుల వినతి
కొడంగల్: కొడంగల్ మండలానికి కేటాయించిన విద్యా సంస్థలను ఇతర మండలాలకు తరలించరాదని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్, కర పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోన్నోజు వెంకటేశ్వర్లు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు పులిందర్ గౌడ్, స్వేరో నాయకులు కుప్పగిరి సాయిలు, డావుల వెంకట్ మాట్లాడారు. కొడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాల, ఫైర్ ఇంజన్, ప్రభుత్వాస్పత్రి, వెటర్నరీ కళాశాల, సైనిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఏటీసీ, వ్యవసాయ కళాశాలను హకీంపేటకు తరలించవద్దని కోరారు. కొడంగల్‌లోనే భవనాలు నిర్మించాలన్నారు. మెడికల్ కళాశాలను మండల పరిధిలోని అప్పాయిపల్లిలో, గురుకులాలను మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్‌లో నిర్మించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను తరలించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఆనంద్‌కుమార్ లాహోటీ, రమేష్‌బాబు, భీంరాజు, మాసాని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు


