వేసవిని దృష్టిలో పెట్టుకొని పక్కాగా ప్లానింగ్
సమస్య తలెత్తిన వెంటనే సత్వర చర్యలు
ప్రభుత్వ నిర్ణయాలే మా ప్రాధమ్యాలు
విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లపైప్రత్యేక ఫోకస్
‘సాక్షి’తో కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్: ‘జిల్లా జనాభాకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి.. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం.. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం’. అని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకొని నెల రోజు లు అవుతున్న సందర్భంగా పలు అంశాలను పంచుకున్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యలు, ఎంచుకోవాల్సిన ప్రాధమ్యాలపై అవగాహన వచ్చిందన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. ప్రజలతో పాటు పశు పక్ష్యాదుల దాహర్తిని తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రోజుకు 22గంటల పాటు నీటి శుద్ధి
జిల్లాలో రెండు చోట్ల నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. పరిగి మండలం జాఫర్‌పల్లి వద్ద ఉన్న ప్లాంట్ రోజుకు 135 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. కొడంగల్‌లో 17 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ అందుబాటులో ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 18 గంటల పాటు నీటిని శుద్ధి చేసేవారం. వేసవి దృష్ట్యా 22 గంటలు శుద్ధి చేస్తున్నాం. జిల్లాలో సుమారు పది లక్షల జనాభా ఉండగా రోజుకు వారికి 130 ఎంఎల్‌డీ నీరు అవసరం అవుతాయి. రెండు ప్లాంట్ల ద్వారా 145 ఎంఎల్‌డీ నీటిని పంపింగ్ చేస్తున్నాం. తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఆర్థిక సంఘం నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉన్న వనరులు, వ్యవస్థలను సమర్థవంతగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
24 గంటల్లో మరమ్మతులు
జిల్లాలో పైప్‌లైన్ లీకేజీలు, బోర్ వెల్స్, బోరు బా వులు పాడైన 24 గంటల్లో బాగు చేయించి అందుబాటులోకి తెచ్చేలా సిబ్బందిని అప్రమత్తం చేశాం. అవసరం ఉన్న చోట కొత్త బోర్లు వేసేందుకు చర్య లు తీసుకుంటాం. అనుకోకుండా ఏదైనా సమస్య తలెత్తినా.. పంపింగ్ సిస్టంకు ఇబ్బందులు ఎదురైనా జిల్లా వాసులకు నీటి కష్టాలు రానివ్వం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. గ్రామ పంచాయతీల్లో పశువుల దాహర్తి తీర్చేందుకు నీటితొట్లను అందుబాటులోకి తేచ్చాం. వాటిలో నీళ్లు నింపాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించాం. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం.
సన్నాల సాగును ప్రోత్సహిస్తాం
ప్రభుత్వ ప్రాధమ్యాలైన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సకాలంలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. త్వరలో జనాభా లెక్కలు, ఎస్‌ఐఆర్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తాం. సన్నరకం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కౌన్సిలర్లు, అధికారులను అప్రమత్తం చేస్తాం. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రథమిక ఆరోగ్య కేంద్రాలను, విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎంపిక చేసిన కేజీబీవీల్లో ఐఐటీ ఫౌండేషన్ కూడా అందించాలని ఆదేశించాం. ఇందులో భాగంగా ఖాన్ అకాడమి వారితో కలిసి విద్యాశాఖ పనిచేసేలా చర్యలు చేపడుతున్నాం.
జనాభాకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి


