తాండూరు టౌన్: అప్రమత్తతతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తాండూరు ఫైర్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని అభ్యాస్ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వెలువడితే తడి దుప్పటితో ఆర్పేయడం, పొగతో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశం నుంచి బయటకు వెళ్లడం, ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యలపై పలు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుందన్నారు. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి తాగిన అనంతరం ఆర్పేయకుండా పడేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వంటిట్లో గ్యాస్ సిలిండర్ వినియోగించే వారు తరచూ రెగ్యు లేటర్, గ్యాస్ పైపును సరిచూసుకోవాలన్నారు. వంట పూ ర్తయిన తర్వాత గ్యాస్ సరఫరాను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది శ్రీనివాస్, ఇబ్రహీం, రఘుపతి రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


