పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం
దుద్యాల్: అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి కడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ తెలిపారు. గురువారం పాఠశాల భవనానికి పైకప్పు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల కోసం పన్నెండేళ్ల క్రితం పది గదులు మంజూరు చేశారు. అప్పట్లో అసంపూర్తిగా నిర్మించి కాంట్రాక్టర్ వదిలేసి పోయాడు. ఈ సమస్యను ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కడా ప్రత్యేక నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేశారు. దీంతో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శ్రీశైలంగౌడ్, సత్యనారాయణ, ఖాజా, హజీ, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు.


