మహిళా కూలీకి పాముకాటు
తాండూరు రూరల్: పొలంలో పత్తి తీస్తుండగా ఓ మహిళా కూలీని నాగు పాము కాటేసింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, జిల్లా ఆస్పత్రి సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ సఖీనా కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. మూడు నెలల క్రితమే ఆమె భర్త మొగులాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. గురువారం గ్రామంలో ఓ పొలంలో పత్తి తీసేందుకు సఖీనా తోటి కూలీలతో కలిసి వెళ్లింది. దాహం వేసి పొలం గట్టు వద్దనున్న వాటర్ బాటిల్ తీస్తుండగా అక్కడే మాటు వేసిన నాగు పాము ఆమెను కాటేసింది. దీంతో తోటి కూ లీలు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి ఆటోలో తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం నగరానికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యానికి సహకరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


