దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు
● కొనుగోలు కేంద్రాలను
వినియోగించుకోండి
● కల్‌కోడ క్లస్టర్ ఏఈఓ వినయ్
మర్పల్లి: రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, తమ ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కల్‌కోడ క్లస్టర్ ఏఈఓ వినయ్ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం ఆవరణలో మక్కజొన్న మర్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సహకార సంఘం సిబ్బంది నరేష్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించేందుకు వచ్చే రైతుల పంట వివరాలు ఆన్‌లైన్‌లో ఉండాలన్నారు. ఎకరాకు 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పారు. తేమ శాతం 14 శాతం లోపు ఉండాలని తెలిపారు. క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.24 వేల మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చే ముందు రైతులు తమ ధాన్నాన్ని ఆరబెట్టుకొని, నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులు ముందుగానే ఏఈఓ ల వద్ద స్లిప్ రాయించు కోవాలని సూచించారు.


