‘బ్రిలియంట్‌’ దొంగలు దొరికారు | - | Sakshi
Sakshi News home page

‘బ్రిలియంట్‌’ దొంగలు దొరికారు

Nov 19 2025 8:34 AM | Updated on Nov 19 2025 8:34 AM

‘బ్రి

‘బ్రిలియంట్‌’ దొంగలు దొరికారు

ఇంజినీరింగ్‌ కళాశాలలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

పరారీలో మరో ముగ్గురు..

రూ. 37.5 లక్షల నగదు స్వాధీనం

నాగోలు: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గత నెల 10వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసును ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు చేధించారు. అంతర్రాష్ట దొంగల ముఠాలోని ఆరుగురిలో.. ఇద్దర్ని అరెస్టు చేసి ఒక మైనర్‌ను హోమ్‌కు తరలించారు. వారి వద్ద రూ.37.05 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ అనురాధ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజు మనోహర్‌ పవార్‌, దనేష్‌ మోహితే, రితిక్‌ అలియాస్‌ రితిక్‌ మోహితే, అరుణ్‌ మోహితే, విలాస్‌ బోహన్‌, 16 ఏళ్ల బాలుడు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు వాళ్లకు నచ్చిన ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేస్తారు.

గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా..

ఈ ముఠాలోని నిందితులు గూగుల్‌ మ్యాప్‌ ఉపయోగించి జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న విద్యాసంస్థలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులు ఒకరికొకరు బంధువులు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ చోరీకి ముందు వీరంతా ముందుగా గుజరాత్‌ రాష్ట్రం వల్సాద్‌ జిల్లాలోని ఉమర్గామ్‌ గ్రామంలో సమావేశమయ్యారు. అక్టోబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ నగర శివార్లలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 8న స్లీపర్‌ బస్సులో హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతంలో దిగారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో స్నానం చేసిన తర్వాత, జూపార్క్‌కు ఆటోలో వచ్చి సమీపంలోని దుకాణంలో హ్యాండ్‌ గ్లవ్స్‌ కొనుగోలు చేశారు. అనంతరం గూగుల్‌ మ్యాప్‌ ఉపయోగించి తట్టి అన్నారంలోని శ్రేయాస్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బందిని చూసి చోరీ చేయలేమని భావించారు. తర్వాత బాటసింగారంలోని బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల చోరీకి అనుకూలంగా ఉందని గుర్తించారు. ఆటోలో కళాశాలకు చేరుకుని అర్ధరాత్రి 12 గంటలకు కళాశాల అడ్మిన్‌ బ్లాక్‌లోని గ్రిల్‌, డోర్‌ లాక్‌లను పగలగొట్టి అల్మారాలో ఉన్న దాదాపు రూ.1.07 కోట్ల నగదును చోరీ చేశారు. కాలేజీ ఉన్న సీసీ కెమెరాల్లోని రికార్డులను సైతం ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం డబ్బులు వాటాలు వేసుకుని తీసుకున్నారు. కొంత డబ్బును కళాశాల సమీపంలోని ఒక పాడుబడిన గదిలో ఉంచారు. తర్వాత జాతీయ రహదారిపై ట్రావెల్‌ బస్సు ఎక్కి సిటీకి చేరుకున్నారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్‌కు క్యాబ్‌లో..అక్కడి నుంచి విజయవాడకు ఆటోలో వెళ్లారు. అనంతరం స్లీపర్‌ బస్సులో విజయవాడ నుంచి ముంబైకి వెళ్లారు. కాలేజీలో చోరీ జరిగిన సంఘటన తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ వీరన్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌, సీసీఎస్‌, ఐటీ సెల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో గాలించి పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలోని కొత్తగూడ చౌరస్తా వద్ద రాజ్‌ మనోహర్‌ పవార్‌, రితిక్‌, బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

‘బ్రిలియంట్‌’ దొంగలు దొరికారు1
1/1

‘బ్రిలియంట్‌’ దొంగలు దొరికారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement