హక్కులను కాపాడండి
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు
అనంతగిరి: వయోవృద్ధుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేయాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో సీనియర్ సిటిజన్ హక్కులపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం సఖి సెంటర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జుకారెడ్డి, ప్రతినిధులు మొగులయ్య, శ్రీహరి, బందెప్ప, జీవన్‌కుమార్, బందెప్పగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హస్తం గూటికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
తాండూరు: మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం నాయకుడు సాజీద్ అలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంఐఎం నుంచి రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆయన ఐదేళ్లపాటు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొనసాగారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
సీసీఐ జీఎంగా రవీందర్‌కుమార్ సరోజ్
తాండూరు రూరల్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా రవీందర్ కుమార్ సరోజ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన శరత్‌కుమార్ ఢిల్లీలోని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ ప్లాసింగ్ డైరక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఆయన స్థానంలో బొకొజన్ సీసీఐ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా పని చేసిన రవీందర్ కుమార్ సరోజ్ కరన్‌కోట్ సీసీఐ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు.
వ్యక్తి అదృశ్యం
అనంతగిరి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడుపల్లిలో చోటు చేసుకుంది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరయ్య(57) ఈ నెల 15న ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆ చూకీ లభించలేదు. ఈ మేరకు మంగళవారం శంకరయ్య భార్య అంజమ్మ పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు 87126 70030, 87126 70031 లో సంప్రదించాలన్నారు.
తాళం వేసిన ఇంటికి కన్నం
మూడు తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణ
యాలాల: తాళం వేసిన ఇంటికి గుర్తు తెలి య ని దుండగులు కన్నం వేశారు. ఈ ఘటన మండల పరిధిలోని రాజీవ్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కాలనీకి చెందిన పోతుల బుజ్జమ్మ ఉదయం 11గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో దుండగులు తాళం పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన బుజ్జమ్మ తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలసుకున్న పోలసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
దొరకని కొండ చిలువ జాడ
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని న్యూ సుభాష్ నగర్ కాలనీలో సోమవారం స్థానికలు కంటపడి కలకలం రేపిన కొండ చిలువ కోసం మంగళవారం అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు వెతికినా ఫలితం లేకపోయింది. పరిసరాలను శుభ్రం చేయించి, ట్రాక్టర్‌తో దున్నించినా దాని జాడ తెలియలేదు. స్థానికులకు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
హక్కులను కాపాడండి
హక్కులను కాపాడండి
హక్కులను కాపాడండి


