పసిడి వ్యాపారి పరార్
కుల్కచర్ల: ప్రజలు నగల తయారీకి ఇచ్చిన పాత బంగారం, డబ్బుతో ఓ వ్యాపారి ఉడాయించాడు. ఈ ఘటన మంగళవారం వెలుగుజూసింది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో కొంతకాలం క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేంద్ర చౌదరి అజయ్ జ్యూవెలరీ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతడిని నమ్మి బంగారు ఆభరణాలు చేయించుకునే వారు. రెండు నెలల క్రితం జేర్పుల రఘు నగలు చేయించుకునేందుకు తన వద్ద నున్న ఐదున్నర తులాల పాత బంగారం, రూ.1.30 లక్షల నగదు ఇచ్చాడు. కాగా నూతన ఆభరణాల కోసం పలుమార్లు ప్రశ్నించగా మూడు రోజులు దుకాణం తెరవకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో మోసపోయానని గ్రహించిన రఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రచౌదరి బాధితులు మండల వ్యాప్తంగా ఉన్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు


