కూర్చున్న చోటే కింద పడి వ్యక్తి మృతి
● తొలుత అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
● సీసీ ఫుటేజ్‌లో బయటపడ్డ నిజం
తాండూరు టౌన్: ఓ వ్యక్తి కూర్చున్న చోటే కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంతారం తండాకు చెందిన రామునాయక్ (50) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం చించోళి రోడ్డు మార్గంలోని గీతా వైన్స్ షాపు పక్కన విగతజీవిగా కనిపించాడు. తలకు రక్తగాయం ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పక్క షాపులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. రామునాయక్ కూర్చున్న చోటు నుంచి కిందపడి పోవడం, తలకు దెబ్బ తగలడం, ఓ వ్యక్తి వచ్చి అతనికి సాయం చేయడం, ఆ తర్వాత కదలలేని స్థితిలో ఉన్న అతన్ని పక్కకు పడుకోబెట్టిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. దీంతో రామునాయక్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, బహుషా మూర్చ వచ్చి కిందపడి తలకు దెబ్బ తగిలి మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు.


