పురోగమనం
న్యూస్‌రీల్
అభివృద్ధికి పట్టం
కమ్మని భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వికారాబాద్: సీఎం సొంత నియోజకవర్గం దుద్యాల్ మండలంలో ఏర్పాటు చేయదలచిన మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు విషయంలో ప్రభుత్వం పురోగతి సాధించింది. అధికారుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఐదు గ్రామాల పరిధిలో 1,358 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1,267 ఎకరాలను సేకరించారు. లగచర్ల గ్రామానికి చెందిన రైతులు భూములు ఇవ్వమంటున్నారు. ఈ క్రమంలో 91 ఎకరాలకు చెందిన పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం ద్వారా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ముందుగా పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించాలని భావించిన అధికారులు లగచర్ల ఘటనతో కొంత వెనక్కు తగ్గారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి భూ సేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
పరిహారం ఇలా..
2012 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకాస్త పెంచి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అప్పట్లో అధికారులు రైతులకు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉందని దీని ప్రకారమే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.10 లక్షలు, రూ.6 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడం, అర్హతను బట్టి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, ఎకరాకు 125 గజాల ప్లాటు ఇవ్వాలని నిర్ణయించింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పరిహారం పెంచింది. అసైన్డ్, పట్టా భూమి(ఎకరాకు)కి రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం బాధిత రైతులకు ఇదే పరిహారం ఇచ్చారు. మహబూబ్‌నగర్ – చించోలి హైవేకు అనుకుని అభివృద్ధి చేసే డీటీసీపీ అప్రూవ్‌డ్ లేఅవుట్‌లో ఎకరాకు 150 గజాల ప్లాటు ఇవ్వనున్నారు. అర ఎకరం కంటే తక్కువ ఉన్నా.. ఐదారు గుంటల భూమి కోల్పోయిన వారికి 75 గజాల ప్లాట్ ఇవ్వనున్నారు. ఈ ఒక్కో ప్లాట్ మార్కెట్ విలువ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంటున్నారు. అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. త్వరలో సేకరించిన భూములు టీజీ ఐఐసీకి అప్పగించనున్నారు. అలాగే ఇండస్ట్రీయల్ పార్కు పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
నాడు వ్యతిరేకించి.. నేడు జైకొట్టి..
2024 నవంబర్ 11న లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికారులు గ్రామంలోకి రావొద్దంటూ రైతులు అడ్డుకున్నారు. మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని కొందరు చెప్పడంతో అధికారులు గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు ఉన్నట్టుండి అధికారులపై దాడి చేశారు. భయాందోళన చెందిన వారు పరుగులు పెట్టారు. అదే రోజు రాత్రి పోలీసులు గ్రామాల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. కేసులు నమోదు చేశారు. రైతులను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించాడనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ఏ–1 ముద్దాయిగా చేర్చారు. మరో 38 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. వారు జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చారు. ఏడాది తర్వాత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు రైతుల్లో మార్పునకు దోహదం చేశాయి. భూములిచ్చిన రైతుల రుణం తీర్చుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన మాట ప్రకారం భారీగా నిధులు, అభివృద్ధి పనులు మంజూరు చేశారు. దీంతో భూములివ్వమన్న వారు కూడా పారిశ్రామిక వాడకు జై కొట్టారు. భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు 80 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఎన్నో ఒడిదుడుకుల అనంతరం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. తొలుత ప్రభుత్వం ఫార్మాసిటీని ప్రకటించడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే.. అధికారులపై దాడులు, రైతుల అరెస్ట్, భూములు ఇవ్వమంటూ ఆందోళనల వంటి అనేక ఘటనల తర్వాత భూ సేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఓ అడుగు ముందుకేసింది.
ఇండస్ట్రియల్ పార్కుకు భూ సేకరణ దాదాపు కొలిక్కి
మొత్తం సేకరించాల్సింది 1,358 ఎకరాలు
ఇప్పటి వరకు తీసుకున్నది 1,267 ఎకరాలు
ఇంకా రైతులు ఇవ్వాల్సింది 91 ఎకరాలు
పరిహారం ప్రక్రియ పూర్తి
ఒప్పుకోని రైతుల డబ్బు కోర్టులో డిపాజిట్
టీజీ ఐఐసీకి భూముల అప్పగింతకు ఏర్పాట్లు
ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రికెట్ గ్రౌండ్, ప్లే ఫీల్డ్, స్విమ్మింగ్ పూల్, సైనిక్ స్కూల్, హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్, పార్క్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్, ఇంజనీరింగ్ కాలేజీ, హాస్టళ్లు, ఆడిటోరియం, వెటర్నరీ క్యాంపస్, కాలేజీ, హాస్టళ్లు, మెడికల్ కళాశాల, హాస్టళ్లు, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ, డిగ్రీ కళాశాలలు, అతిథి గృహం, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పురోగమనం


