పరిహారం చెక్కు డ్రా కావడం లేదు
బషీరాబాద్: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈనెల 3న జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ దస్తగిరిబాబా కుటుంబానికి ప్రభుత్వం అందజేసిన రూ.7 లక్షల చెక్కు డ్రాకావడం లేదు. మృతుడికి ఇద్దరు భార్యలు హసీనాబేగం, సాజిదాబేగం, తల్లి షౌకత్‌బేగంతో పాటు మొదటి భార్యకు జన్మించిన ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్ దస్తగిరి మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ డెత్ సర్టిఫికెట్ ఎవరు జారీ చేస్తారనేది వారికే క్లారిటీ లేకుండాపోయింది. దీంతో దిక్కు తోచని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా చెక్కులు మృతుడి పేరున ఉన్నందున డ్రా చేసేందుకు డెత్ సర్టిఫికెట్ కావాలన్నారు. అది ఇస్తేనే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. తమ సమస్యను పరిష్కరించాలని మృతుడి భార్య హసీనాబేగం కోరారు.


