ఆరని పొలం తీరని నష్టం
ఆరుగాలం శ్రమించిన పంట చేతికొచ్చే సమయంలో అన్నదాతల ఆనందానికి అవధులుండవు. ఇన్నాళ్లు వారు పడిన కష్టాన్ని మరిచిపోతారు. జీవితం సుఖదుఃఖాల మిళితం అన్నట్లు వరి కోతలకు పొలాలు ఆరకపోవడంతో హార్వెస్టర్లు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో ఖర్చులు అధికం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుద్యాల్: ఇటీవల కురిసిన వర్షాలతో దుద్యాల్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి రైతులపై అధికంగా ప్రభావం చూపాయి. పంట చేతికొచ్చి కోతలు ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా కర్షకులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన పంటను కోద్దామనుకుంటే పొలాలన్నీ బురదతో కూరుకుపోయాయి. దీంతో వరి కోతలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బురదలో ఎక్కడ దిగబడి నష్టం కలిగిస్తుందోనని హర్వెస్టర్ల యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు యంత్రాలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఒకవేళ ఫోర్‌వీల్(పెద్ద కోత యంత్రం) వచ్చినా గంట సమయంలో కోయాల్సిన ఎకరం పొలానికి రెండు నుంచి మూడు గంటల వరకు పడుతుంది. దీంతో కోత ఖర్చులు మూడింతలు పెరిగి రైతుల జేబుకు చిల్లుపడుతున్నాయి. పంట కోయకుండా అలాగే ఉంచితే ధాన్యం గింజలు నేలపై పడుతున్నాయని, పొలంలో ఆరబెట్టక ముందే కోత చేస్తే ఖర్చులు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
యంత్రాలకు డిమాండ్
వర్షాల ప్రభావంతో బురదమయంగా మారిన పొలాలు ఆరకపోవడంతో కోతలకు అవరోధం ఏర్పడుతోంది. ఫోర్‌వీల్ యంత్రాన్ని వినియోగిస్తే సాధారణ యంత్రం కంటే అదనంగా గంటకు రూ.500 పెంచడంతో పాటు సమయం సైతం ఎక్కువ అవుతుంది. దీంతో రైతన్నలకు రెండు విధాలుగా నష్టం వాటిళ్లుతుంది. పొలాలు ఆరిన తర్వాత కోతలు చేద్దామనుకుంటే పంట కాలం పూర్తవ్వడంతో మొక్కలు నేలపై వాలుతున్నాయి. అలా నేలపై వాలడంతో ధాన్యం రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా యంత్రం ఆరిన పొలంలో ఒక గంట కోతకు రూ.2,500 చార్జీ తీసుకుంటున్నారు. ఫోర్‌వీల్ యంత్రంతో కోత చేస్తే గంటకు రూ.3,000 వరకు చార్జీ వసూలు చేస్తున్నారు. పొలం దిగబడకుండా ఉంటే ఒక ఎకరం వరి పొలాన్ని గంటలోనే కోస్తుంది. ప్రస్తుతం పొలాలు బురదమయంగా ఉండి దిగబడుతుండడంతో ఎకరం పొలం కోయడానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. దీంతో రైతు అధికంగా చార్జి చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా భారీ నష్టం కలుగుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వరి కోతలతో తప్పని తిప్పలు
పంట చేతికొచ్చిన తరుణంలో పరేషాన్
బురదలో కూరుకుపోతున్న హార్వెస్టర్లు
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
ఖర్చుల భారం
పొలాలు బురదమయంగా ఉండడంతో యంత్రాలు దిగబడుతున్నాయి. దీంతో నెమ్మదిగా కోస్తున్నారు. నాకు మూడు ఎకరాల పంట ఉంది. కోయడానికి ఫోర్‌వీల్ యంత్రం పెట్టాను. గతంలో మూడు గంటల్లో కోసేది, ప్రస్తుతం ఐదు గంటలు అయింది. ఖర్చుల భారం అధికమైంది.
– సంతోష్‌నాయక్, రైతు, నాన్యనాయక్ తండా
ఆరని పొలం తీరని నష్టం
ఆరని పొలం తీరని నష్టం


