లారీల అడ్డాగా నవాబుపేట
నవాబుపేట: మండల కేంద్రం మైనింగ్ లారీలకు అడ్డాగా మారింది. ప్రధాన రోడ్డుపై ఉన్న వైన్స్, హోటళ్ల ఎదుట వాటిని పెద్ద ఎత్తున నిలుపుతూ వాహనాల కేంద్రంగా మార్చుతున్నారు. మండల పరిధిలోని వట్టిమీనపల్లి, మాదిరెడ్డిపల్లి, ఆర్కతల, యావాపూర్ గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలు కొంత కాలంగా జరుగుతున్నాయి. ఎర్రమట్టిని వివిధ ప్రాంతాలకు తరలించే లారీలు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు పక్కనే నిలుపుతున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైన్స్ ఎదుట డ్రైవర్లు లారీలను గంటల కొద్ది నిలిపి మద్యం తాగుతున్నారు. తాగిన మైకంలో నడుపుతూ ఎక్కడ ఏ ప్రమాదం చేస్తారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలతో ప్రధాన రోడ్డు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అదే వైన్స్ ఎదుట లారీల అడ్డా చేసుకోవడంతో మండలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


