రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం లింగంపల్లి అనుబంధ గ్రామమైన మనోహరబాద్‌కు చెందిన హనుమండ్ల పెంటయ్య(55) సెంట్రింగ్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఇబ్రహీంపట్నంలోని రాఘవేంద్ర హోటల్‌లో టీ తాగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌కు వెళుతున్న మహేంద్ర బొలెరో వాహనం(కోళ్ల లోడ్) ఆయన్ని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పెంటయ్య మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి వర్గాలు, ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.


