అంతా ఆగిపోయె! | - | Sakshi
Sakshi News home page

అంతా ఆగిపోయె!

Oct 10 2025 12:54 PM | Updated on Oct 10 2025 12:54 PM

అంతా ఆగిపోయె!

అంతా ఆగిపోయె!

పార్టీలకతీతంగా సహకరించాలి బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలతోనే.. ● అడ్డుకోవడం దారుణం ● రిజర్వేషన్లు ప్రభుత్వ డ్రామా

వికారాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిండంపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ వీడటం లేదు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసి పది రోజులు కావస్తున్నా ఇంకా అయోమయ పరిస్థితులే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్‌ 9పై స్టే విధించడంతో ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారం వెళితేనే ఎన్నికలు జరుగుతాయనే వాదన తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు, తప్పు మీదంటే మీదేనంటు విమర్శలు చేసుకుంటున్నారు.

ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో..

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న నేతలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఎన్నికలు జరుగుతాయా..? జరగవా..? ఒకవేళ నిర్వహిస్తే ప్రస్తుత రిజర్వేషన్లతోనా.. లేకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారమా అనే అయోమంలో ఉన్నారు. వార్డులు, గ్రామాలు, మండలాల్లో రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.

బీసీ రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గానికి దక్కా ల్సిన న్యాయమైన హక్కు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజ ర్వేషన్లు కేటాయించింది. ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి. తమ హక్కుల సాధన కోసం పార్టీలకతీతంగా పోరాటం చేస్తాం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్లతో గద్దెనెక్కే నాయకులు ఇప్పుడు న్యాయమైన వాటా అడిగితే వారి కుఠిల బుద్ధి చూపిస్తున్నారు.

– లాల్‌కృష్ణప్రసాద్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కుల్కచర్ల: బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలతోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కకుండా పోతోందని కుల్కచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు ముదిరాజ్‌ ఆరోపించారు. గురువారం ఆ పార్టీల తీరును తప్పుపడతూ కుల్కచర్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి మంచిపేరు వస్తుందనే అక్కసుతోనే బీజేపీ ఈ బిల్లు ఆమోదించకుండా చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పరోక్షంగా బీసీలకు రిజర్వేషన్లు వర్తించకుండ కేసులు వేయించడం జరిగిందన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినమాట ప్రకారం కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోనే బిల్లు పెట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కుల్కచర్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు అనందం, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, నాయకులు రాంరెడ్డి, భరత్‌కుమార్‌ రెడ్డి, కృష్ణయ్య, ఎం వెంకటయ్య, రాములు, అనంతయ్య, లక్ష్మయ్య, సాయన్న, శివ,తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: బీసీలకు రాజ్యాధికారం దక్కకుండ కొందరు అడ్డుకోవడం ఆవేదన కలిగిస్తోందని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బందయ్య అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చట్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా రిజర్వేషన్లు కల్పించి తప్పు చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అగ్రవర్ణాలు సైతం బీసీల ఎదుగుదలను ఓర్వలేక ఇలా కోర్టుల్లో కేసులు వేసి వారికి రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దుద్యాల్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బోగమోని సురేశ్‌ ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల ఆశ చూపి కోర్టులో కేసులు వేయించారని విమర్శించారు. తద్వారా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయాలని చేస్తోందన్నారు. వెంటనే ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

ఇలా నామినేషన్లు .. అలా నిలిపివేత

మళ్లీ మొదటికొచ్చిన ఎన్నికల ప్రక్రియ

అంతర్మథనంలో ఆశావహులు

రిజర్వేషన్లపై ఆయా పార్టీల నేతల పరస్పర ఆరోపణలు

ఇది ప్రభుత్వ వైఫల్యమే.. కాదు ప్రతిపక్షాల కుట్ర

తప్పు మీదంటే మీదేనని విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement