
వాట్సాప్ వ్యవసాయం
రైతుల కోసం ప్రత్యేక చానల్ ప్రారంభించిన వ్యవసాయ శాఖ కర్షకుల సమస్యలకు పరిష్కారంచూపుతున్న శాస్త్రవేత్తలు, అధికారులు క్షణాల్లో సమాచారం చేరవేత
దుద్యాల్: రైతులకు వ్యవసాయ సమాచారం సులువుగా అందించేందుకు వ్యవసాయ శాఖ నూతనంగా వాట్సప్ చానల్ రూపొందించింది. సాగు చేసిన పంటలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ చానల్‌లో శాస్త్రవేత్తలు,వ్యవసాయాధికారులు సూచనలు అందిస్తున్నారు. ఈ చానల్ పంటలకు సంబంధించి కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో కర్షకులకు చేరవేస్తూ అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, వాతావరణ సూచనలు, నాటు పద్ధతులు, ప్రభుత్వ రాయితీలు, తదితర వ్యవసాయ సమాచారాన్ని అందిస్తున్నారు.
తెలుగులో సమాచారం
వ్యవసాయశాఖ ప్రారంభించిన వాట్సాప్‌చానల్‌లో అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక ప్రతిభావంతులను చేర్చారు. తాజాగా గ్రూప్‌లో రైతులను చేర్చాలని ఆదేశాలు రావడంతో ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ రైతు వాట్సాప్ చానల్‌లో చేరే అవకాశం కల్పించింది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల సమాచారం రైతులకు సులువుగా చేరుతోంది. తెలుగులోనూ సమాచారం అందుబాటులో ఉండడంతో రైతులు వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. తెగుళ్లను ఫొటోలతో సాయంతో లక్షణాలు, నివారణకు పురుగు మందులు ఎలా వినియోగించాలనే సమాచారం ఇస్తున్నారు. వాట్సాప్ చానల్‌లో చేరాలనుకుంటే సంబంధిత ఏఈఓ, మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఒక్క క్లిక్‌తో..
వ్యవసాయశాఖ రూపొందిన వాట్సాప్ చానల్ ద్వారా రైతులు ఒక క్లిక్‌తో నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందవచ్చు. పంటల రోగ నిరోధకత, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, విత్తనాల ఎంపిక వంటి సలహాలు అరచేతిలోకి చేరుతున్నాయి. తమ సమస్యలను ఫొటో లేదా మెసేజ్ రూపంలో షేర్ చేస్తే నిపుణులు వెంటనే సమాధానం అందిస్తారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులకు ఒకే సారి సమాచారం తెలుసుకునేందుకు డిజిటల్ వ్యవసాయ విజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉందని రైతులు చెబుతున్నారు.
తక్షణ పరిష్కారం
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం నేరుగా అందించడం వ్యవసాయ శాఖ ఉద్దేశ్యం. ఇప్పటికే రైతులు సమాచారలోపంతో సాగు చేస్తున్న పంటల్లో దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. అందరి రైతుల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లడం కష్టం. ఈ చానల్ ద్వారా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందవచ్చు. సమస్యలపై తక్షణ పరిష్కారం అందించడంతో ఉత్పత్తి పెరుగుతుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది. రైతులు చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి, వికారాబాద్

వాట్సాప్ వ్యవసాయం