
ఎందుకిలా..?
గురుకులాలు, వసతి గృహాల్లో ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు ఘటనలు చోటుచేసుకున్న సమయంలోనే అధికారుల హడావుడి కొత్తగడి, నవాబుపేట, మొయినాబాద్ ఘటనలు మరువక ముందే మంబాపూర్ గురుకులంలో భవనంపై నుంచిదూకిన విద్యార్థి ప్రిన్సిపాళ్లు, వార్డెన్లపై తీవ్ర ఆరోపణలు ప్రత్యేక కౌన్సెలింగ్ చర్యలనుపక్కన పెట్టిన ప్రభుత్వం
విద్యాహక్కు(ఆర్టీఈ) చట్టం ప్రకారం పనిష్‌మెంట్, మానసిక, శారీరక శిక్షలు, అవమానించటం, వేధింపులకు గురిచేయడం, తోటి విద్యార్థుల ముందు అవమానించేలా మాట్లాడడం, క్రమశిక్షణ పేరుతో పనిష్‌మెంట్ ఇవ్వడం బోధనా పద్దతులకు వ్యతిరేకం. ఇది నేరం కూడా. రికార్డులు, పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులను తోటి విద్యార్థుల ముందు తక్కవ చేసి మాట్లాడడం, అవమానించడం, క్షోభకు గురిచేయడం తదితర కారణాలతో గతంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. కాగా ఈ ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధిత విద్యార్థులు క్షోభకు గురికావడానికి గల కారణాలు విశ్లేషించడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మానసిన వైద్య నిపుణులు, మోటివేటర్స్‌తో కౌన్సెలింగ్ ఇప్పించటం లాంటి చర్యలు చేపట్టడం లేదు.
ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్.. విద్యా వ్యవస్థలోపర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఈ పదం తెలియని వారుండరు. విద్యార్థులు ఎవరికి వారు ప్రత్యేకమని అర్థం. ఒక్కొక్కరిలో ఒక్కోలా సామర్థ్యాలు, అభ్యసనా శైలి, ఆసక్తి, సవాళ్లుంటాయి. వ్యక్తిగత వ్యత్యాసాలను గుర్తించడమే ప్రధానం. క్రమశిక్షణ పేరిట అందరినీ ఒకేలా చూడడం కుదరదు. చాలా చోట్ల పిల్లలను చూడడంలో మాత్రం ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. దీంతో తరచూ గురుకులాలు, విద్యాలయాలు, వసతి గృహాల్లో ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
వికారాబాద్: వసతి గృహాలు,గురుకుల పాఠశాల ల్లో పరిస్థితులు నానాటికి తీసికట్టుగా మారుతున్నా యి.ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ప లితాలు ఇవ్వడం లేదు. సంబంధిత శాఖల హెచ్‌ఓడీలు పర్యవేక్షణ గాలికొదిలేయడంతో వార్డెన్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.దీంతో బలవన్మరణానికి యత్నిస్తున్నఘటనలు పెరిగిపోయాయి. దుర్ఘటనలు జరిగిన నమయాల్లో హడావుడి చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సమస్యలు వేధిస్తుంటే.. మరి కొందరు విద్యార్థులు పరిస్థితులకు అలవాటు పడక, సహచ ర విద్యార్థులతో ఇమడ లేక ఆత్మహత్యలకు యత్నించడం,పారిపోవడం తదితర మార్గాలను ఎంచుకుంటున్నారు.గతంలో కొత్తగడి గురుకులలో ఓ విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం..మెయినాబాద్, నవాబుపేటలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యా యి. తాజాగా పెద్దేముల్ మండలం మంబాపూర్ గురుకుల పాఠశాలో ఆరోతరగతి విద్యార్థి శనివారం భవనంపై నుంచి దూకడం చర్చనీయాంశమైంది.
మండల ప్రత్యేకాధికారులుగా హెచ్‌ఓడీలు
విద్యార్థులు ఏడాది పొడువునా సమస్యలతో సతమవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం మొదలు అస్వస్థతకు గురవ్వడం, ఇబ్బందులు పడడం తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు స్పందించిన కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు హాస్టళ్లు, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల హెచ్‌ఓడీలను మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించారు. వారు వారంలో రెండు స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి పరిస్థితి పర్యవేక్షించాలని అవసరమైన చోట చక్కదిద్దాలని ఆదేశించారు. ఈ చర్యలు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం మారడం లేదు.
క్రమశిక్షణ పేరుతో శిక్షలు నేరం
టార్గెట్ చేశారు
ఓ సిమెంట్ దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తూ కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించా. ఆమె మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్, 8, 9వ తరగతుల్లోనూ ఏ గ్రేడ్ వచ్చింది. తమ కూతురును చూసేందుకు వెళ్లినప్పుడు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని చూపింది. బాగు చేయించాలని ఉపాధ్యాయులను కోరాం. దీంతో వారు మా కూతురిని టార్గెట్ చేశారు. దీంతో ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కాలు విరిగడంతో పాటు గాయపడింది. కట్టు కట్టించి ఇంటికి పంపారు.
– యాదయ్య, బాధిత విద్యార్థి తండ్రి
సామాజిక తనిఖీలు అవసరం
బాలల విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యా విషయాల పై..విద్యార్థులపై ఒత్తిడి చేయడం.. మిగతా విద్యార్థుల ముందు చులకనగా మాట్లాడటం నేరం. పలు సందర్భాల్లో విద్యార్థులను ఒత్తిడికి గురిచే సినట్టు స్పష్టమవుతోంది. ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. గురకుల ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి సైతం బాలల హక్కులు, వాటి పరి రక్షణపై, హక్కులను కాలరాస్తే పడే శిక్షలపై శిక్షణ అవసరం. బాలల రక్షణ విధానం అమలును ప్రతీ మూడు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ ద్వారా సమీక్షించాలి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనూ ఓ కమిటీ వేసి సామాజిక తనిఖీ నిర్వహించాలి.
– ఆర్. వెంకట్‌రెడ్డి,
కన్వీనర్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక

ఎందుకిలా..?