
ధరలు ౖపైపెకి..!
అర కిలోతో సరి
హుడాకాంప్లెక్స్: ఏకధాటి వర్షాలు.. వరదలు కాయగూరల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటలు దెబ్బ తినడం.. దిగుబడి భారీగా తగ్గిపోవడం వెరసి ఇటు రైతులను, అటు కొనుగోలుదారులను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కూరగాయలే కాదు ఆకుకూరల ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.40లోపే పలికిన వంకాయ, బీన్స్ ధర బహిరంగ మార్కెట్లో సెంచరికీ చేరువలో ఉన్నాయి. ఇక పచ్చిమిర్చి, కాకర, దొండ, దోసకాయ, గోకర, బీర ధరలు సైతం రెట్టింపయ్యాయి. పాల కూర, తోటకూర, పుదీనా, బచ్చలికూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో కట్ట రూ.5లోపే విక్రయించగా ప్రస్తుతం ఏ ఆకుకూర కొనాలన్నా ఒక్కో కట్టకు రూ.10 వెచ్చించాల్సి వస్తోంది.
బోర్డు ధరలకు భిన్నంగా..
సరూర్‌నగర్ మార్కెట్, ఎన్టీఆర్‌నగర్ కూరగాయల మార్కెట్లకు సాధారణ రోజుల్లో రోజుకు సగటున 480 క్వింటాళ్ల కాయగూరలు దిగుమతి అవుతుండగా, వారాంతాల్లో 520 నుంచి 600 క్వింటాళ్ల వరకు దిగుమతి అవుతున్నాయి. యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలు, వరదల కారణంగా పంటలు పాడై దిగుమతి భారీగా తగ్గింది. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాదు ఆయా మార్కెట్లలోని బోర్డులపై ఉన్న ధరలకు.. బయట ఉన్న ధరలకు పొంతనే ఉండడం లేదు. రైతు బజార్‌లోని వ్యాపారులు సైతం బోర్డుపై ఉన్న ధరలకు భిన్నంగా విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో ఒకప్పుడు కిలో కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు.
రైతులకు బదులు వ్యాపారుల తిష్ట
ఎప్పటికప్పుడు ధరలను నియంత్రించాల్సిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యాపారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి .. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఫిర్యాదు చేసినా.. చర్యలకు వెనుకాడుతున్నారు. రైతుబజార్లలో రైతులకు బదులు వ్యాపారులు తిష్టవేశారు. పంట తీసుకుని వచ్చిన వాళ్లను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు ఆయా మార్కెట్ల ముందు ఉదయం, రాత్రి ప్రధాన రోడ్డుకు అటుఇటుగా కుప్పలు పోసుకుని అమ్ముకోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం, తక్కెడ, బాట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో రైతులు తమ పంటను తక్కువ ధరకే దళారులకు అమ్ముకుని పోతున్నారు.
భగ్గుమంటున్న కూరగాయల రేట్లు
ఆకుకూరలదీ అదే పరిస్థితి
ఏకధాటి వర్షాలతో దెబ్బతిన్న పంటలు
తగ్గిన దిగుబడి.. అమాంతం పెరిగిన ధరలు
పావుకిలో, అరకిలోతో సరిపెట్టుకుంటున్న జనం
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కాయగూరల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనాలన్నా కిలో 60రూపాయలపైనే చెల్లించాల్సి వస్తోంది. దీంతో అరకిలో, పావు కిలో కొనుగోలు చేస్తున్నాము. వ్యాపారులు కేజీ తీసుకుంటే ఒక ధర.. అరకేజీ తీసుకుంటే మరో ధర చెబుతున్నారు. – లక్ష్మి, గృహిణి