ప్రారంభించారు.. ప్రవేశం మరిచారు
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం నేటికీ అందుబాటులోకి రాలేదు. నెల రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో పనులు కాకపోవడం వల్లే ఆస్పత్రిని అందులోకి తరలించలేదని తెలిసింది. ప్రస్తుతం పాత భవనంలోనే చాలీ చాలనీ వసతులతో సేవలు అందిస్తున్నారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
330 పడకల సామర్థ్యంతో..
రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వికారాబాద్‌కు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. భవన సముదాయం, ఇతర వసతుల కోసం రూ.240 కోట్లు మంజూరు చేసింది. గత విద్యా సంవత్సరం వంద మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు అనుబంధం జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 330 పడకల సామర్థ్యం గల నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. పట్టణ పరిధిలోని ఎస్‌ఏపీ కళాశాల ఎదుట నూతన భవన నిర్మాణం చేపట్టారు. తుది దశ పనులు జరుగుతుండగానే ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైద్య సేవలు అందిచడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఆస్పత్రిని అక్కడికి తరలించలేదు. ప్రస్తుతం బస్టాండ్ రోడ్డులో గల ఏరియా ఆస్పత్రి పాత భవనంలో జనరల్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద బెడ్లు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
నత్తనడకన పనులు
జిల్లా కేంద్రంలో రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని షరతు విధించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయలేదు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా భవనం అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం సకాలంలో బిల్లుల చెల్లించకపోవడంతోనే పనుల్లో జాప్యం జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు. భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకముందే హడావుడిగా ప్రారంభించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్యను వివరణ కోరగా త్వరలో నూతన భవనంలోకి జనరల్ ఆస్పత్రిని మారుస్తామని తెలిపారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
నెల రోజుల క్రితం జనరల్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర
నేటికీ అందుబాటులోకి రాని వైనం
పాత భవనంలోనే సేవలు
గదులు సరిపోక ఇబ్బంది పడుతున్న రోగులు


