
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైపాల్ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌లో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
రోడ్డు విస్తరణ
పనులకు మార్కింగ్
కొడంగల్: పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శనివారం ఆర్‌అండ్‌బీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మార్కింగ్ ఇచ్చారు. ఈ పనులకు రూ.45 కోట్లు మంజూరైనట్లు అధికారులు చెప్పారు. 4 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నాలుగు లేన్లుగా విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. వినాయక చౌరస్తాను విస్తరించనున్నారు. పట్టణంలోని తాండూరు మహబూబ్‌నగర్ జాతీయ రోడ్డును విస్తరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, దుకాణాదారులు సహకరించాలని అధికారులు కోరారు.
భాస్కరయోగికి
పాత్రికేయ విశిష్ట పురస్కారం
పరిగి: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి రచయిత డాక్టర్ భాస్కరయోగికి సమాచార భారతి.. నారద జయంతి సందర్భంగా కాలమిస్టుగా పాత్రికేయ విశిష్ట పురస్కారం అందజేసింది. నగరంలోకి కోఠిలో వైఎంఐఎస్‌లో పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు చామర్తి ఉమామహేశ్వరరావు, సాయి ప్రసాద్, సమాచార భారతి అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరి
తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
యాలాల: వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యాలాల ఎస్‌ఐ గిరి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు నంబర్ ప్లేట్లు, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్‌కు లోబడి వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో పీఎస్‌ఐ వినోద్ పాల్గొన్నారు.
వీర సైనికులకు ఘన నివాళి
అనంతగిరి: పాక్ దాడుల్లో మృతి చెందిన వీర సైనికులకు శనివారం వికారాబాద్‌లోని కొత్తగంజ్ హనుమాన్ మందిరం వద్ద కాలనీవాసులు ఘనంగా నివాళులర్పించారు. ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి