
కాగ్నా.. ఖాళీ!
యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు
ఇటీవల తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి శివారులోని కాగ్నా నది నుంచి అర్ధరాత్రి వేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అదే గ్రామానికి చెందిన జర్నప్ప డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. అరగంట వ్యవధిలో జర్నప్ప వద్దకు అగ్గనూర్‌కు చెందిన ఓ నాయకుడు తన అనుచరులతో వచ్చాడు. పోలీసులకు సమాచారం ఇస్తావా అంటూ దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తే ఇసుక వ్యాపారులు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఈ ఒక్క సంఘటన చాలు ఇసుక మాఫియాకు పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటో అనేది అర్థమవుతుంది. జర్నప్ప ఒక్కడిమీదే కాదు ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వచ్చే వారు ఎవరైనా దాడులకు గురికావడం నిత్యకృత్యంగా మారింది. గతేడాది ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఎస్‌ఐలు, సీఐలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు.
తాండూరు: నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తాకుతూ కాగ్నానది ప్రవహిస్తుంది. వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భూగర్భ జలాల పెంపునకు ఈ నది ఎంతగానో దోహదం చేస్తుంది. తాండూరు పట్టణంతోపాటు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తుంది. కొడంగల్ నియో జకవర్గానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి కాగ్నాపై రాబందుల్లా ఇసుక వ్యాపారులు విరుచుకపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఇసుక రవాణాకు అడ్డంకి లేకుండా చూసుకుంటున్నారు. రెండు నెలల క్రితం వీర్‌శెట్టిపల్లికి చెందిన జర్నప్ప ఇసుక అక్రమ రవాణాపై డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసుల ద్వారా ఆ సమాచారం ఇసుక మాఫియాకు చేరింది. సదరు వ్యక్తిపై అక్రమార్కులు దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు.
అనుమతి లేకుండానే..
ఉదయం 11 గంటల ప్రాంతంలో కాగ్నానది నుంచి ఇసుక లోడ్‌తో ట్రాక్టర్లు తాండూరు పట్టణానికి రావడం కనిపించింది. నది నుంచి వరుసగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు బయటికి వచ్చాయి. అనుమతి పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే మా ఓనర్ వద్ద ఉన్నాయంటూ ట్రాక్టర్ డ్రైవర్లు సమాధానం చెప్పారు. ఇసుక తవ్వుతున్న చోట రెవెన్యూ సిబ్బంది కనిపించలేదు.
చెక్ డ్యాం పక్కనే తవ్వకాలు
తాండూరు పట్టణ శివారులో కాగ్నా నదికి సంబంధించిన చెక్‌డ్యాం ఉంది. ఇక్కడి నుంచి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది. చెక్ డ్యాం ద్వారా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడి పంప్ హౌస్‌కు ఇరువైపులా ఇసుక తోడేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెక్ డ్యంకు 3 కిలోమీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేయరాదు. కానీ ఇసుక వ్యాపారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు.
అన్ని మండలాల్లో ఇదే తంతు
తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. ఇసుక వ్యాపారులు మాఫియాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. పెద్దేముల్ మండలం రేగొండి, రుక్మాపూర్, మంబాపూర్, మన్‌సాస్‌పల్లి, పెద్దేముల్, మంబాపూర్ గ్రామాల్లో ఇసుక రవాణాకు అడ్డూఅదపు లేకుండా పోయింది. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్, కో కట్,సంగెంకుర్దు, దేవనూర్, అగ్గనూర్ గ్రామాలు.. బషీరాబాద్ మండలం ఎక్మాయి, జీవన్గి, క్యాద్గిరా, ఇందర్‌చెడ్, దామర్‌చెడ్, మంతట్టి, రెడ్డిగణపూర్, గొట్టిగకలాన్ గ్రామాలు, తాండూరు మండలంలో పాత తాండూరు, బిజ్వార్, చిట్టిగణపూర్, చంద్రవంచ, నారాయణపూర్, వీర్‌శెట్టిపల్లి గ్రామా లు ఇసుక రవాణాకు కేంద్రంగా మారాయి. తాండూరు పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నా ఇసుక రవాణాను కట్టిడి చేయలేకపోతున్నారు.
రోజూ 300ల ట్రాక్టర్లతో..
కాగ్నానది నుంచి నిత్యం 300ల ట్రాక్టర్లతో పదుల ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం ప్రాంభమవుతుంది. వర్షాలు పడితే ఇసుక సేకరణకు అవకాశం ఉండదు. దీంతో అక్రమార్కులు వీలైనంత వరకు ఇసుకను తోడేసి ఖాళీ స్థలాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక టన్ను నాణ్యమైన ఇసుకకు మార్కెట్‌లో రూ.2,500 నుంచి రూ.3వేల ధర పలుకుతోంది. ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. టిప్పర్‌కు రూ.50 వేలు తీసుకుంటున్నారు.
రాత్రి వేళ ట్రాక్టర్ల మోత
అర్ధరాత్రి వేళ ఇసుక ట్రాక్టర్ల కారణంగా కంటిమీద కునుకు లేకుండా పోతోందని పాతతాండూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత తాండూరు మీదుగా రెండు మార్గాల ద్వారా కాగ్నానదిలోకి దారి ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల తిరుగుతున్నాయి. వాటి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు.
నిత్యం 300ల ట్రాక్టర్లతో
వేల ట్రిప్పులు
రూ.లక్షల్లో వ్యాపారం
ఫిర్యాదు చేసే వారిపై దాడులకు తెగబడుతున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు
పోలీసులకు ఫిర్యాదు చేస్తే..
కాగ్నానది నుంచి రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలి స్తున్నారని డయల్ 100 కు ఫోన్ చేశా. ఇసుక వ్యాపారులు ఇంటికి వచ్చి నాపై దాడి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశా. నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు.
– జర్నప్ప, వీర్‌శెట్టిపల్లి, తాండూరు మండలం
ఆ ప్రాంతాల్లోనే తవ్వకాలు చేయాలి
కాగ్నానదిపరీవాహక ప్రాంతంలో ఆరు చోట్ల ఇసుక త వ్వకాల కోసం పాయింట్ల ను గుర్తించాం. ఇసుక అవసరం ఉన్న వారు రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అనుమతులు ఇస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇసుక సేకరించాలి.
– సత్యనారాయణ, ఏడీ, గనుల శాఖ
కేసులు పెడుతున్నాం
కాగ్నానది నుంచి ఇసుక అ క్రమ రవాణాను అడ్డుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమో దు చేశాం. అనుమతి పత్రాలు ఉంటేనే ఇసుకను తరలించాలి. ఇసుక రవాణాపై సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నాం.
– బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ, తాండూరు సబ్‌డివిజన్

కాగ్నా.. ఖాళీ!

కాగ్నా.. ఖాళీ!

కాగ్నా.. ఖాళీ!

కాగ్నా.. ఖాళీ!