అంగరంగ వైభవంగా ధ్వజారోహణం
స్వర్ణకాంతుల్లో శ్రీవారి ఆలయం
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహద్వారం నుంచి ఆలయ ప్రాకారాల వరకు పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు. హథీరాంజీ మఠం, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్ప ప్రదర్శనశాలలో దేశీయ పుష్పాలతోపాటు వివిధ రకాల విదేశీ పుష్పాలతో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌న్, కళా ప్రదర్శనలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయి.
తిరుమల:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తిచేశారు. మీన లగ్నంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన అర్చకులు ఆవిష్కరించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకం ఎగరడంతో బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రంగా భావిస్తారు. గరుడుడి ఆహ్వానాన్ని అందుకుని దేవతలు, అష్టధిక్పాలకులు, దేవగణాలు తొమ్మిది రోజులపాటు తిరుమలలో జరిగే శ్రీవారి ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ధ్వజారోహణానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు పరివార దేవతలతో కలిసి తిరుచ్చి వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు.
భక్తుల వీక్షణ.. విష్వక్సేనుడి పర్యవేక్షణ
సోమవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమానికి అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ముందుగా విష్వక్సేనుడు ఛత్రచామరాలు, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం యాగశాలకు చేరుకుని భూమిపూజ నిర్వహించారు. నిర్ణీత పాళికల్లో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవధాన్యాలతో బీజావాపం చేశారు. పాళికల్లో వేసిన విత్తనాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని అర్చకులు ప్రార్థించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు.
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు విచ్చేసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల జరిగిన పెద్ద శేష వాహన సేవను సీఎం వీక్షించి తరించారు.
పెద్ద శేష వాహనంపై అభయముద్ర
బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు.
పటిష్ట బందోబస్తు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు, టీటీడీ విజిలె న్స్, ఎస్పీఎఫ్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య తదితర విభాగాల సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.


