తిరుపతి తుడా: ఆమె ఒంటరి మహిళ. ఒక్కగానొక్క కొడుకు మానసిక వ్యాధిగ్రస్తుడు. 75 ఏళ్ల వయసులో ఆమె కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. దూరపు బంధువులు తప్ప ఆమెకు నా అన్న వారు ఎవరూ లేరు. తిరుపతిలో 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంట్లో నివసిస్తోంది. అలాంటి ఒంటరి మహిళ ఇంటిని పక్కింటి వ్యక్తి తనకున్న అధికార పార్టీ నాయకుల అండతో కూల్చి వేయించాడు. పాత భవనానికి సెట్‌బ్యాక్ స్థలం వదల్లేదని 70 ఏళ్ల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ఇంటిని కూల్చేశారు. పాత భవనాన్ని ఇప్పుడు ఆక్రమణ పేరుతో తొలగించడం అన్యాయమని అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో తొలగించక తప్పలేదు.
వేకువజామునే దండయాత్ర
కరుడుకట్టిన టీడీపీ నాయకురాలిగా గుర్తింపు పొందిన ఇంద్రాణి ఇంటిపై ఆ పార్టీ నేతలు బుధవారం వేకువజాము నుంచే దండయాత్ర చేయించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పెద్ద సంఖ్యలో పోలీసులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం ఒక్కటై తెల్లవారక ముందే యంత్రాలతో ఇల్లును తొలగించేశారు. కనికరం లేకుండా ఒంటరి మహిళ అని చూడకుండా టీడీపీ ముఖ్య నేతలు క్రూరత్వంతో వ్యవహరించారని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు. వీరి కుటుంబం అంతా రామచంద్రపురం మండలం, కమ్మపల్లికి చెందిన టీడీపీ వారే. బాధితురాలు ఇంద్రాణి ఇంటికి ఆనుకుని ఉన్న స్థలం యజమాని మంత్రి నారా లోకేశ్ ద్వారా ఒత్తిడి తెచ్చి తొలగింపజేశారని బాధితురాలు ఆరోపించింది. పాత భవనానికి ఇప్పుడు నిబంధలు ఏమిటంటూ స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు.
నా ఉసురు తగులకుండా పోదు
ఎవ్వరూ లేని నాపై టీడీపీ నేతలు, అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారు. 70 ఏళ్లుగా లేని ఆక్రమణ ఈ రోజే ఎందుకు కనిపించింది. మంత్రి నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు ఒత్తిడితో నా ఇల్లును తొలగించారు. మా కుటుంబం, మా బంధుగణం అంతా కరుడుగట్టిన టీడీపీ వాళ్లమే. మాకే ఇంత అన్యాయం చేస్తారా..?. ఈ పాపంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోతారు. – ఇంద్రాణి, బాధితురాలు


