– డీపీఓ సుశీలాదేవి
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని బొక్కిసంపాళెం గ్రామం డీడీయూపీఎస్‌వీపీ (దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్) పురస్కారానికి ఎంపిక కావడం, రూ.కోటి నగదు అవార్డును దక్కించుకోవడం గర్వకారణమని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి అన్నారు. బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆమె మాట్లాడారు. దేశంలోనే బొక్కిసంపాళెం ప్రథమ స్థానాన్ని సాధించేందుకు కృషి చేసిన ఎంపీడీఓ పెంచల శ్యామ్, డిప్యూటీ ఎంపీడీఓ పద్మజ, గ్రామ సర్పంచ్ రేఖ, పంచాయతీ కార్యదర్శి విజయ్, మహిళా సంఘాలను ప్రత్యేకంగా అభినందించారు. డిప్యూటీ ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను పంచాయతీ అభివృద్ధికి విడుదల చేయడం చాలా ఆనందదాయకమన్నారు. అందుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ రేఖ, మహిళా సంఘాలు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, నాయకులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. గ్రామ సర్పంచ్ రేఖ మాట్లాడుతూ సమష్టి కృషితోనే ఈ విజయం సాధించామని నాయకులు, అధికారులు, తమ వంతు సహాయ సహకారాల్ని అందించారని కొనియాడారు. అనంతరం సర్పంచ్ దంపతులను నాయకులు, అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


