బుచ్చినాయుడుకండ్రిగ: ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువలో కాలు జారిపడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు తిరువట్టూరు టౌన్‌కు చెందిన జయశంకర్ కుమారుడు జీవా (25) ఓప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 15 మంది స్నేహితులతో కలసి ఆదివారం ఉబ్బలమడుగు జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. ఉబ్బలమడుగు జలపాతం వద్ద జీవా స్నేహితులతో పాటు మద్యం సేవించి సమీపంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్దకు వచ్చారు. ఇందులో ముగ్గురు స్నేహితులు తెలుగుగంగ కాలువలో ఈత కొట్టారు. కాలువలో మద్యం మత్తులో ఈత కొట్టుతున్న ముగ్గురు గట్టుపైకి రావటానికి ఇబ్బంది పడుతుండగా జీవా వారిని పైకి లాగడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి కాలువలో పడిపోయాడు. దీంతో జీవా కాలువలోని నీటిలో మునిగిపోయి, గల్లంతు అయాడు. వెంటనే స్నేహితులు పోలీసు, ఫైర్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్, సిబ్బందితో కలసి జీవా మృతదేహాం కోసం గాలించగా, మృతదేహాం లభ్యమైంది. జీవా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.


