తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్‌లో నిత్యావసర సరుకులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పేదోడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. తాజాగా ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఓ వైపు గ్యాస్ సిలిండర్ల డిమాండ్ చోటుచేసుకోవడంతోపాటు మరో వైపు వంట నూనె ధరలు పెంచేశారు. లీటర్ పై రూ.10 నుంచి 15 వరకు పెంచేశారు. వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ.20 నుంచి రూ.25 పెంచేశారు. యుద్ధం నేపథ్యంలో విదేశాల నుంచి దిగుబడి తగ్గిందని, ఉత్పత్తులు తగ్గాయని, సుంకాలు పెరిగాయంటూ పలు వంకలు చెబుతూ వంటనూనె ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు. సన్‌ప్లవర్ ఆయిల్ లీటర్ రూ..166 నుంచి 178కి, వేరుశనగ నూనె లీటర్ రూ. 215 నుంచి రూ. 240కి, అలాగే పామాయిల్ లీటర్ రూ.131 నుంచి 142ి పెంచేశారు. ఎందుకు రేట్లు పెంచారంటే ఇరాన్– ఇజ్రాయిల్ యుద్ధం అంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు.
మహిళపై హత్యాయత్నం
రేణిగుంట: మండలంలోని మామండూరులో ఓ వ్యక్తి, ఓ మహిళను తనతో మునుపటిలా వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేసి, అంగీకరించకపోవడంతో ఆమైపె హత్యాయత్నానికి పాల్పడినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలానికి చెందిన 36 ఏళ్ల మహిళ, శనివారం రాత్రి అమరరాజా ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళుతుండగా గంగమ్మ గుడి సమీపంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డగించి, మునుపటిలా తనతో చనువుగా ఉండాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడై తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమైపె దాడి చేసి, గాయపరిచాడు. గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే కరకంబాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు తనకు తానే కత్తితో గాయాలు చేసుకుని తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
పంటలపై అడవి పందుల దాడి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కుక్కంబాకంలో రైతులు సాగు చేసిన పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కంబాకం గ్రామం అడవీ ప్రాంతానికి అనుకుని 165 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సాగు చేసిన పంటలను అడవిపందులు రాత్రి వేళలో ధ్వంసం చేస్తున్నాయి. పందుల బెడదతో కొంతమంది రైతులు పంటలను వేయకుండా మానుకున్నారు.
అర్ధరాత్రి కారు దగ్ధం
చంద్రగిరి: రోడ్డు ప్రమాదానికి గురైన కారు దగ్ధమైన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పూతలపట్టు–నాయుడుపేట రోడ్డు కోట సమీపంలో ఈ నెల 17వ తేదీన కారు బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తీసి పెట్టారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కారులో నుంచి మంటలు వ్యాపించి, దగ్ధమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దుప్పిని ఢీకొన్న
గుర్తుతెలియని వాహనం
సూళ్లూరుపేట రూరల్: స్థానిక జాతీయ రహదారిపై కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం గుర్తుతెలియన వాహనం చుక్కల దుప్పిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చుక్కల దుప్పికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన చుక్కల దుప్పికి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
నలుగురు జూదరుల అరెస్టు
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ఉడమలపాడు శివార్లలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి, ఏడుగురు జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీకాళహస్తి రూరల్ ఇన్‌స్పెక్టర్ ఇబ్రహీం తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ సి. వెంకటేష్ పాల్గొన్నారు.


