28 వేల మంది విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం విద్యాశాఖ సమన్వయ లోపం స్పష్టం
తిరుపతి అర్బన్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో ఒకరిద్దదు కాదు.. 28 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి తిరుపతి జిల్లాలో నెలకొంది. వంట నిర్వాహకులు చేతులెత్తేయడంతో శుక్రవారం తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, అలాగే వడమాలపేట, రామచంద్రాపురంలోని 40 శాతం పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించకపోవడంతో వారంతా పస్తులతో ఇంటికి వెళ్లారు. ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న క్రమంలో ఉదయం 7.45 గంటలకు పాఠశాలకు చేరుకున్న పిల్లలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలో ఉంటారు. అనంతరం పాఠశాలలో పెట్టే భోజనం తీసుకున్న తర్వాత ఇంటికి వెళతారు. అయితే శుక్రవారం భోజనం లేదని చెప్పడంతో నిరుత్సాహంతో నీరసంగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది.
విద్యార్థులకు అందని ఇస్కాన్ భోజనం
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు, అలాగే రామచంద్రాపురం, వడమాల పేట మండలాల్లోని 40 శాతం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్న భోజనం రోజు అందిస్తుంటారు. మొత్తంగా 494 పాఠశాలల్లోనే 38 వేల మందికి ఇస్కాన్ భోజనం సరఫరా చేస్తుంటారు. అందులో తిరుపతి అర్బన్ మండలాన్ని మినహాయిస్తే 28 వేల మంది పిల్లలకు శుక్రవారం మధ్యాహ్న భోజనం అందలేదు.
విద్యాశాఖ సమన్వయ లోపం
రంజాన్ పండుగ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి 10 గంటలపైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించి, శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ విషయం గురువారం రాత్రి 10 గంటలపైన ఇస్కాన్ యాజమాన్యానికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే వారికి సకాలంలో సమాచారం అందలేదని శుక్రవారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేపట్టలేదు. ఆ తర్వాత తిరుపతి సమాచారం వచ్చినప్పటికి వంట మాస్టర్లతోపాటు నిర్వాహకులు, సిబ్బంది అందుబాటులో లేరని భోజనం తయారు చేయని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఒకరిద్దరు వంట మాస్టర్లతో తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అన్నం ,ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనం అందించారు. తిరుపతి రూరల్, రేణిగుంట, వడమాలపేట , రామచంద్రాపురం మండలాల్లోని పాఠశాలల్లోని పిల్లలకు భోజనం అందలేదు. దీంతో వారంతా పస్తులతో బాధతో ఇంటికి వెళ్లారు.
ఆకలి విద్యకు ఆటంకం కాకూడదు.. పిల్లలు కడుపు నిండా తినాలి.. కళకళ
లాడుతూ ఇళ్లకు వెళ్లాలన్నది ప్రభుత్వం సంకల్పం.. ఇదే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే వంట నిర్వాహకులు.. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం.. సమాచార
అంతరాయం.. అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం వెరసి పేదపిల్లలు శుక్రవారం
మధ్యాహ్నభోజనం మిథ్యగా మారింది. ఫలితంగా చిన్నారులు ఆకలితో
నకనకలాడుతూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది.
సమాచారం అందిన వెంటనే తెలియజేశాం
రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిన వెంటనే శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మద్యాహ్నం భోజనం సిద్ధం చేయాలనే సమాచారాన్ని ఇస్కాన్‌కు ఇచ్చాం. అయితే గురువారం రాత్రి సమాచారం ఆలస్యంగా వచ్చింది. ముందుగా శుక్రవారం సెలవుగా నిర్ణయించి, ఆ తర్వాత శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించాలని సమాచారం ఇచ్చారు. వంట మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో అందరికీ భోజనం అందించలేకపోయామని వారు వెల్లడించారు. ఇకపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. –కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి


