ఏర్పేడు: రైతులకు ఉపయోగపడే రీతిలో సెమీ ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధే లక్ష్యమని తిరుపతి ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ తమిదా సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి ఐఐటీలోని రీసెర్చ్ పార్క్‌లో వడమాలపేట మండలానికి చెందిన రైతులకు సెమీ–ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన సీడ్ (సైనన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్) విభాగం స్పాన్సరింగ్ ఏజెన్సీగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ పరిశోధకులు రూపొందించిన యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి ల్యాబ్ పరికరాలు, వేరుశనగ పొట్టు తీసే యంత్రాలపై ప్రజెంటేషన్లు జరిగాయి. ఈ ల్యాబ్ ద్వారా వ్యవసాయ పరికరాల రంగంలో భవిష్యత్‌లో మరిన్ని నూతన ఆవిష్కరణలకు ఒక కేంద్రంగా నిలిచేందుకు కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ అజయ్‌కుమార్, వ్యవసాయ అధికారి విజయకుమార్, వడమాలపేట గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు.


