అభినయ్‌ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం తిరుపతి రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదే భూమన కుటుంబం ఆప్యాయత, ఆదరణ మరువలేం సన్మాన సభలో ప్రతినభూనిన మాజీ కార్పొరేటర్లు భూమన కరుణాకరరెడ్డికి ఆత్మీయ సన్మానం
తిరుపతి సిటీ: ‘జగనన్నను ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రపోం.. అభినయ్‌ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. భూమన కుటుంబం ఆప్యాయత, ఆదరణ మరువలేం’ అని తాజా మాజీ కార్పొరేటర్లు ప్రతినబూనారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సన్మాన సభకు మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన్ అభినయ్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీషతోపాటు మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతిని పాలించిన ఎంతో మంది మహానీయులకు సాధ్యం కానీ అభివృద్ధిని భూమన అభినయ్‌రెడ్డి అనతి కాలంలోనే చేసి చూపించారన్నారు. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. తరువాత భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తన 53 ఏళ్ల రాజకీయ జీవితంలో సన్మానాలకు దూరంగా ఉన్నానని, ఇది తనకు తొలి సన్మానమని చెప్పారు. ప్రతి కార్యకర్త, సభకు విచ్చేసిన ప్రతి కార్పొరేటర్‌ను తన కుటుంబ సభ్యులు, బంధువులుగా భావించి అండగా ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ సన్మానం చివరిది కావచ్చని సభలో వెల్లడించారు.
చారిత్రక అభివృద్ధికి చిహ్నంగా అభినయ్
తిరుపతి నగర రూపురేఖలు మార్చిన యువనేత అభినయ్ నగర చారిత్రిక అభివృద్ధికి చిహ్నంగా మారారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కొనియాడారు. డిప్యూటీ మేయర్ హోదాలో ఆయన చేసిన మాస్టర్ ప్లాన్‌రోడ్లతో తిరుపతి రూపం మారిందన్నారు. గాడ్ ఫాదర్‌లా భూమన కుటుంబం ఎంతో మంది సామాన్యులను రాజకీయ నేతలుగా తీర్చిద్దిందని చెప్పారు. పులికడుపులో పులి పుడుతుందన్న చందంగా భూమన అభినయ్ తిరుపతి ప్రజలకు వరమని కొనియాడారు. వచ్చే ఎన్నికలల్లో అభినయ్‌ని ఎమ్మెల్యేగా, జగనన్నను సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని సూచించారు.
సమష్టికృషితో అభివృద్ధి
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నగర మేయర్ డాక్టర్ శిరీష సహకారంతో కార్పొరేటర్లతో కలసి సమష్టిగా నగరాభివృద్ధికి కృషి చేశామని మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి అన్నారు. ఎప్పుడూలేనంత అభివృద్ధిని తిరుపతి ప్రజలు కళ్లారా చూశారన్నారు. తిరుపతి ఉన్నంత కాలం నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్‌ను ప్రజలు మరచిపోరన్నారు. 2022 జులై 15వ తేదీ నగరంలోని ప్రతిపాదించిన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. అనుకున్న 14 మాస్టర్ ప్లాన్ రోడ్లుతో పాటు మొత్తం 21 రోడ్లును నిర్మించి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వం ఎదుట మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రతిపాదన పెట్టామని, కానీ ఇప్పటివరకు ఆ ఊసేలేదన్నారు.
భూమన ఆదర్శనీయులు
నగర మేయర్‌గా తాను భూమన కుటుంబం సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానని భూమనకరుణాకరరెడ్డి ఆదర్శనీయులని తాజా మాజీ మేయర్ శిరీష అన్నారు. కరుణాకరరెడ్డి ఉద్యమనేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధుడన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని తపన పడే వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి ఆయన అని కొనియాడారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఆయన పడే తపన వర్ణించలేదని చెప్పారు. సమయ పాలన, వాక్ చాతుర్యం, క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన వద్ద నేర్చుకున్నానని తెలిపారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన భూమన అభినయ్ తిరుపతికి దేవుడిచ్చిన వరమన్నారు. అతి చిన్న వయస్సులో చారిత్రక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మించడాన్ని యావత్ నగర ప్రజలు గర్వించారన్నారు. సాధారణ వ్యక్తులమైన మనందరికీ రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆ కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు.


