శ్రీకాళహస్తి: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందిన విశ్వసనీయ సమాచారంతో శ్రీకాళహస్తిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న ఒక ప్రొవిజన్ షాపు వెనుక భాగంలో గ్యాస్‌ను అక్రమంగా నింపి, విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ‘శివ గణేష్’ పేరిట నడుపుతున్న దుకాణం వెనుక అక్రమంగా నాగరాణి అనే మహిళ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిలోని గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో మొత్తం 88 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్‌కు ఉపయోగించే పరికరాలు, త్రాసులు, రాడ్లు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌పీ గ్యాస్‌కు చెందిన డొమెస్టిక్ సిలిండర్లతోపాటు అనధికారిక కంపెనీలకు చెందిన సిలిండర్లు కూడా లభించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.


