తిరుపతి క్రైం : తిరుపతి టౌన్ పరిధిలోని గిరిధర దాస్ లైన్ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సమాచారం మేరకు.. గిరిధర్ దాస్ లైన్‌లోని ఓ ఇంట్లో మహిళ మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని రవీంద్రబాబు గుర్తించి.. వీఆర్వో మురళికి సమాచారం అందించారు. అనంతరం వీఆర్వో ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలు మర్రిబోయిన చైతన్య (26)గా గుర్తించారు. ఆమె భర్త పేరు మర్రిబోయిన మోహనరంగ. ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందినదిగా తెలిసింది. భర్తతో విడిపోయిన ఆమె, గత నెల ఫిబ్రవరి 24 నుంచి తిరుపతిలో సుబ్బయ్య అనే వ్యక్తితో కలిసి ఉంటోంది,. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


